BRS Chief KCR Road Show At Khammam : రాష్ట్రంలో విద్యుత్, సాగు, తాగునీరు సరఫరాపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు మద్ధతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, తాగునీటి సమస్యలపై తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే తనను దూషిస్తున్నారని కేసీఆర్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీకు ఓట్లు, సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని గులాబీ బాస్ కేసీఆర్ అన్నారు. కేంద్రంలో కమలానికి 200 సాట్లు కూడా రావని, సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 12 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"కేంద్రంలో బీజేపీ సర్కార్కు నాలుగు వందల సీట్లు , 370 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదని లోకమంతా కోడై కూస్తోంది. ఈసారి దాదాపు 12 పార్లమెంట్ స్థానాల్లో మనం గెలవగలుగుతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. మీరు నామ నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్రంమంత్రి అవుతారు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
KCR Fires on Congress Over Power Cuts : మహబూబ్ నగర్లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశా, దానికి తానేదో అబద్ధాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ బదులిస్తోంది కానీ సమస్యను పట్టించుకోవటం లేదన్నారు. మూడు నెలల్లోనే కరెంట్ మాయం అయ్యిందా అని ప్రశ్నించారు.
తులం బంగారం అడిగితే కస్సుమంటున్నారు : ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, రూ.2500 ఇస్తామన్న హామీ ఏమయ్యిందన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తులం బంగారం అడిగితే కస్సుమంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను సాధించిన తనని జైళ్లో వేస్తారా? జైళ్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతారా అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారన్న, కాషాయ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒక్కసారి కూడా సీఎం ఖండించలేదని తెలిపారు.
జాతీయ పార్టీలు రెండూ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయ్ : కేసీఆర్ - KCR Election Campaign 2024