Telangana Parliament Elections 2024 : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో మరింత చురుకుగా పాల్గొంటున్నారు. సాధారణ పౌరులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈసారి పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొని, బాధ్యతగా ఓటు వేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Lok Sabha Polls 2024 : ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో తన సతీమణితో కలిసి చంద్రశేఖర్ రావు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి చింతమడకకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ సీఎం కావడంతో అధికారులు సైతం అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Reddy Casted Vote
తొలిసారి ఓటు వేసిన హిమాన్షు : హైదరాబాద్ నందినగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన సతీమణితో కలిసి ఓటు వేశారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు మొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు కల్పిస్తాయని, ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం ఓటు హక్కు అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రభుత్వాలను మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు, ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదని హితవు పలికారు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, ప్రజల సమస్యలకు ప్రాతినిథ్యం వహించే వారికి ఓటు వేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ కవిత మిస్ : మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీ సమేతంగా ఓటు వేసిన ఆయన, ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. అయితే దిల్లీ మద్యం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
దెబ్బకు దెబ్బ - ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - తిరిగి చెంప చెల్లుమనిపించిన ఓటర్ - VOTER SLAPS MLA IN AP