BJP MP Laxman Fires On CM Revanth Reddy : కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. దీన్ని ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరన్నారు. ఆర్.ఎస్.ఎస్‌ను కూడా ఇందులోకి లాగారని మండిపడ్డారు. ఆర్.ఎస్.ఎస్ చీఫ్ స్వయంగా తాము రాజ్యాంగ రిజర్వేషన్లకు అనుకూలమని స్పష్టత ఇచ్చారన్నారు. ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోదీ, అమిత్‌షా చెప్పారని గుర్తుచేశారు.
BJP MP Laxman Comments : నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి మోదీకి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరమైన దేశ విభజనకు నాటి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. లౌకిక వాదం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిందని దుయ్యబట్టారు. ఫేక్ వీడియోతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సిగ్గుతో తలదించుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఫేక్ వీడియో ప్రచారాలు : అబద్ధపు విష ప్రచారాన్ని నమ్ముకొని గతంలో కాంగ్రెస్ గెలిచిందని, కానీ ఈ ఎన్నికల్లో ఆ కుట్రలు చెల్లవని అన్నారు. మద్యం కుంభకోణంలో ఆమ్ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శలు చేశారు. అలాంటి ఆప్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని హస్తం పార్టీ, బీఆర్ఎస్ దోస్తీకి ఇదే నిదర్శనమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన పరిస్థితే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఈ ఎన్నికల్లో 400 మార్క్‌ను టచ్ చేయడంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారనుందని వ్యాఖ్యానించారు.
బీజేపీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. ఆర్.ఎస్.ఎస్‌ను కూడా ఇందులోకి లాగారు. ఆర్.ఎస్.ఎస్ చీఫ్ రాజ్యాంగ రిజర్వేషన్లకు అనుకూలమని క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు వ్యవహరించడం లేదు. ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.రాజ్యాంగం పట్ల ఎంత ప్రేమ ఉందో భావోద్వేగంతో ప్రధాని మోదీ చెప్పారు. - లక్ష్మణ్, బీజేపీ ఎంపీ
సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది : ఎంపీ లక్ష్మణ్ - LAXMAN MEET WITH MEDIA
కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు : లక్ష్మణ్ - LAXMAN ON KCR BUS YATRA