BJP MP Candidate DK Aruna Slams CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ మోసగిస్తున్నారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆగస్టు 15లోపు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ప్రమాణం చేస్తున్న రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పాలమూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఖండించారు.
BJP MP Candidate DK Aruna Comments : అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచినా రుణమాఫీ, రైతుభరోసా పెంపు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ. 2,500 సహా ఇతర హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ ఎన్నికల్లో తాను గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని, ఎలా ఊడిపోతుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏమీ చేయలేదనడం శుద్ధ అబద్ధమని, ఏం చేశానో తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
ముదిరాజుల ఓట్ల కోసం దొంగ హామీలు : రేవంత్‌కు తాను సాటి కానప్పుడు తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. బీసీల పేరిట రేవంత్ ఇచ్చే హామీలన్నీ బోగస్ ఎన్నికల హామీలని విమర్శించారు. 14 సీట్లు గెలిస్తే కడియం శ్రీహరిని మంత్రిని చేస్తానంటున్న రేవంత్ మొదటి కేబినెట్లోనే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ముదిరాజుల ఓట్ల కోసం దొంగ హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ 14 సీట్లు గెలిచేది లేదు శ్రీహరిని మంత్రిని చేసేది లేదన్నారు. గొల్ల కురుమలు గొర్రెల కోసం చెల్లించిన డీడీ డబ్బులు వడ్డీతో సహా ముందు చెల్లించాలని డిమాండ్ చేశారు.
"రేవంత్‌రెడ్డికి సాటికాకుంటే నన్నెందుకు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా తనపై విమర్శలు చేస్తున్నారు. హామీలు అమలు చేయమంటే సీఎం దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు దేవుళ్లు ఏం చేస్తారు? బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి బోగస్ హామీలు ఇస్తున్నారు." - డీకే అరుణ, మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి
ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో పెట్టిందని కనీసం రెండు డీఏలైనా ఇవ్వాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో, మోడల్ స్కూళ్లలో తక్షణం వార్డెన్లను నియమించాలని కోరారు. పోలీసు కానిస్టేబుళ్లకు రెండు డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి కోసం ఏనాడైనా పోరాటం చేశారా ? : డీకే ఆరుణ - Lok Sabha Elections 2024