BJP MP Arvind Comments on CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని, ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రేవంత్‌కు 15 ఏళ్ల రాజకీయ జీవితం ఉందన్న అర్వింద్, కాంగ్రెస్‌కు (Congress Party) భవిష్యత్ లేదని విమర్శించారు. సీఎం రేవంత్ సమర్థుడని, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపై ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసుకుంటారనే పేరుందని ఆరోపించారు.
ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు అయితే కేటీఆర్ కూడా ఆంధ్రాకు పోవాలని సూచించారు. రేవంత్ హిందువు అయితే జ్ఞానవాపీ, మధురపై తన స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జైలు నుంచి పరిపాలన చేయటానికి రేవంత్ రెడ్డి కూడా ప్రిపేర్ అవుతున్నారేమోనని, అందుకే కేజ్రీవాల్(Delhi CM Kejriwal) జైలు నుంచి పాలన చేయటాన్ని రేవంత్ సమర్థిస్తున్నాడని ఎంపీ అర్వింద్ విమర్శించారు. తాజాగా రేవంత్ రెడ్డి హాజరైన 'ఆప్ కీ అదాలత్ షో' పెద్ద కామెడీ షో అని ఎద్దేవా చేశారు.
"రేవంత్ రెడ్డికి కనీసం 15 సంవత్సరాల క్రియాశీలక రాజకీయ జీవితం ఉంది. కొన్ని విషయాల్లో చాలా యాక్టివ్‌గా ఉండి, కష్టపడి జడ్పీటీసీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, పార్టీలు మారి ఇవాళ ఇంతటి స్థాయికి వచ్చారు. కానీ ఇతనికి ఉన్న చరిష్మాకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసమర్థుడిగా మారిపోతారు. ఈ ఎన్నికలే హస్తం పార్టీకి చివరివి." -ధర్మపురి అర్వింద్, బీజేపీ ఎంపీ
MP Dharmapuri Arvind on Congress : పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరకటం లేదన్న ధర్మపురి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి 30ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. హస్తం టికెట్‌పై ఎంపీగా పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపటం లేదని పేర్కొన్నారు. చివరకు అర్హతలేని వారిని తెచ్చుకొని కాంగ్రెస్ ఎంపీ టికెట్లు(Congress MP Tickets) ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేకపోవడం వల్ల నిజామాబాద్‌లో లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందన్నారు.
మోదీ హయాంలో రామ మందిరమే కాదు, కేసీఆర్‌కు కృష్ణ మందిరం కూడా చూపిస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌కు ట్యాపింగ్‌తో(Phone Tapping) సంబంధం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంపీ అభ్యర్థులను నిలబెట్టాయని అర్వింద్ ఆరోపించారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు తెరపించలేదని ప్రశ్నించిన అర్వింద్, కేసీఆర్‌కు లిక్కర్‌పై ఉన్న ప్రేమ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై లేదని ధ్వజమెత్తారు.
జగిత్యాల చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్ - MP Arvind in Chai Pe Charcha