BJP on Congress at Raithu Deeksha Today : గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రైతుల గోస కాంగ్రెస్‌కు గుర్తుచేసే దీక్ష ఇది అని, ప్రతి జిల్లాకు ఈ దీక్షలు తీసుకెళ్తామని తెలిపారు. హైడ్రాపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. రైతు హామీల సాధన కోసం హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ చేపట్టిన 24 గంటల దీక్ష ముగిసిన నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌తో సహా పలువురు నేతలు మాట్లాడారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందే ప్రధాని నరేంద్ర మోదీ అని అర్వింద్ పేర్కొన్నారు. పేదల ఇళ్లనే కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో కొందరు బ్లాక్మెయిల్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
'హైడ్రా పేరుతో కొందరు బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు బ్లాక్ మెయిల్ చేయడం బాగా తెలుసు. హైడ్రా పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తోంది. ఇప్పటికైనా హైడ్రా బంద్ కావాలి'-ధర్మపురి అర్వింద్, ఎంపీ
జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చడం లేదు : బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటేనని, జన్వాడ ఫామ్‌హౌస్ ఎందుకు కూల్చడం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ను మళ్లీ లేపే పని కాంగ్రెస్ పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఉందా? లేదా బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియక, దిల్లీ పెద్దలు ఆరు గ్యారెంటీలను ప్రకటించారని, ఇప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదని విమర్శించారు. సభ్యత్వం నమోదులో బీజేపీ దూసుకుపోతోందని, తెలంగాణలో అనుకున్న లక్ష్యం ప్రకారం సభ్యత్వ నమోదును అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు ఉన్నారా? : వ్యవస్థ తలదించుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నారా? లేదా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇట్లాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా లేక హరీశ్‌రావు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు బీజేపీ విశ్రమించదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే గన్మెన్లు లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు.