BJP DK Aruna Fires On CM Revanth : మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని మహబూబ్‌నగర్‌లో ఓడిపోయినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరండం అని 14 సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మండిపడ్డారు.
DK Aruna Comments On CM Revanth : మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అభ్యర్థిలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారన్నారు. కర్ణాటక నుంచి వచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహాపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పది సీట్లు వస్తాయని అంచనా వేశాం కానీ 8 సీట్లకు పరిమితమయ్యాం అని అన్నారు.
కేంద్రమంత్రి పదవిపై స్పందించిన డీకే అరుణ : లోక్సభ ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి మోదీ అభివృద్ధి నినాదం వెళ్లిందన్నారు. బీజేపీని అడ్డుకోవడం కోసం రిజర్వేషన్లు తీసివేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అయోధ్య ఉండే ఫైజాబాద్ లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పని చేస్తానని కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. 7వ తేదీన ఎంపీలమంతా దిల్లీకి వెళుతున్నామని 8న ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పారు.
"ప్రజలు మళ్లీ నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకున్నారు. దేశానికి మళ్లీ మోదీయే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకున్నారని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలకు కూడా బీజేపీ వ్యాపించింది. ప్రతి ఇంటికి నరేంద్రమోదీ పేరు చేరింది. ఖచ్చితంగా నరేంద్రమోదీ ఛరిష్మా ఈ ఎన్నికల్లో పనిచేసింది. పెద్ద ఎత్తున 8 స్థానాల్లో గెలుచుకున్నాం. మరికొన్ని చోట్ల ఓటమి చెందాం" - డీకే అరుణ, బీజేపీ నాయకురాలు
మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం బీజేపీదే : డీకే అరుణ - DK ARUNA ON MAHABUBNAGAR MP SEAT