Kishan Reddy fires on AIMIM : బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసించిన మజ్లిస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాని పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల వారసత్వంతో వచ్చిన మతోన్మాద పార్టీ, మజ్లిస్ అని ఆయన దుయ్యబట్టారు. మజ్లిస్ పార్టీ పాత పట్టణాన్ని(Old city) అభివృద్ధి జరగకుండా అడ్డుకుందని, చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇళ్లు ఖాళీ చేయించిందని దుయ్యబట్టారు.
మజ్లిస్ పార్టీకి రెండు ఎజెండాలు ఉంటాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించడం, మతోన్మాద చర్యలని పేర్కొన్నారు. వారు చేసే చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ ఉండాలని కోరుకుంటుందన్నారు. బీఆర్ఎస్ (BRS) గత పదేళ్లు ఓట్ల కోసం, మజ్లిస్ కాళ్ల దగ్గర కూర్చుందని ఆయన ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం కలిసి ఉండేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓవైసీ కుటుంబం సోనియా కుటుంబం కలిసిపోయాయన్నారు.
Lok Sabha Elections 2024 : మజ్లిస్ హిందువుల ఇళ్లను దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. మజ్లిస్ పార్టీకి భయపడి చర్లపల్లిలో దాడికి పాల్పడిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా, బాధితులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని, తమ అధిష్ఠానం చెప్పిందని, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అసలు నిజం బయటపెట్టారని స్పష్టం చేశారు.
బీజేపీ హైదారాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒక మహిళను బరిలోకి దింపిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు, చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, మజ్లిస్ నాటకం అయిపోయిందని, కాంగ్రెస్, మజ్లిస్ నాటకం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, రాష్ట్రంలో కాంగ్రెస్ తెస్తానన్న మార్పు.. బీఆర్ఎస్‌తో ఉన్న మజ్లిస్‌ను పక్కన చేర్చుకోవడమేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తాయని, ఈ మూడు పార్టీలు హిందూ వ్యతిరేక దేశాన్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీని కేసీఅర్ పక్కన పెట్టుకున్నారని, ఈ పదేళ్లలో కేసీఆర్ మాట్లాడిందంటే ఓవైసీ బ్రదర్స్‌తోనేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్, మజ్లిస్ పొత్తును అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. ఓవైసీనీ ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు.
"మజ్లిస్ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసించిన మజ్లీస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీ పంచన చేరింది. వీరు ఓట్ల కోసం ఎంతవరకైనా దిగజారుతారు. మజ్లిస్ వ్యతిరేక ఓటును బీఆర్ఎస్, కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారు". - కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి