BJP in Graduates MLC Bypoll : వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం వేడెక్కితే, పట్టభద్రుల ఉప ఎన్నిక షెడ్యూల్ మరింత వేడిని రాజేస్తోంది.
పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి తోడు మరొకరిని పట్టభద్రుల స్థానం నుంచి గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ రేసులో ఇద్దరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? లేక కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకువస్తుందా అని పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రకాశ్‌రెడ్డి వైపే కిషన్‌రెడ్డి మొగ్గు : ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా ప్రకటించింది. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ నేతలు సైతం పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి టికెట్ ఆశిస్తున్న విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఆయనకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయమై కిషన్ రెడ్డిని ఆరా తీయగా, ప్రకాశ్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తే తప్పేముందని గతంలో ఆయనే అన్నారు. దీంతో టికెట్ దాదాపు ఆయనకే దక్కే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం ప్రకాశ్ రెడ్డికి మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
టికెట్ ఆశిస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి : గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మరోసారి తనకే టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఈసారి సానుభూతి కలిసి వస్తుందనే ఆశలు పెట్టుకున్నారు. మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లాకు చెందిన విద్యావంతుడు కాసం వెంకటేశ్వర్లు సైతం పట్టభద్రుల స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆలేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కాసంకు కాకుండా వేరే వ్యక్తికి టికెట్ కట్టబెట్టారు. భువనగిరి లోక్‌సభ టికెట్ వస్తుందని ఆశలు పెట్టకున్నప్పటికీ భంగపాటే ఎదురైంది. దీంతో పట్టభద్రుల స్థానంపై ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - షెడ్యూలు విడుదల