Bhatti Reacts on High Allocation for Agriculture Department : తెలంగాణలో ఏర్పడిన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం - అభివృద్ధికి రెండింటికి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు ఎన్నడూ లేని విధంగా తాము ఈ బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించామని ప్రకటించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ అధికారులతో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన భట్టి విక్రమార్క, గత ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి, దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ బడ్జెట్‌లో దళిత బంధు అని ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించిన భట్టి విక్రమార్క, తనకు నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
హైదరాబాద్ నగరాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, హైదరాబాద్‌లో ఉద్యోగ సంస్థలు రావడానికి కావాల్సిన ఎకో సిస్టం డెవలప్ చేయడానికి కావాల్సిన నిధులను పెట్టుబడిగా పెడుతూ, తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి మణిహారం లాంటి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్ల్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే హ్యూమన్ రిసోర్స్ తయారీ కోసం హైదరాబాద్‌లో పునాదులు వేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విజనరీతో తీసుకున్న మిషన్‌గా అభివర్ణించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పిన భట్టి విక్రమార్క, అందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024
మూడో తరగతి వరకు అంగన్వాడీలు : అంగన్ వాడీలను మూడో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తున్నామన్న ఆయన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతోందని, ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశానికి మార్గదర్శకంగా ఉండబోతుందని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు పూర్తై నిధులు కేటాయించామన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులను కేటాయించినట్లు భట్టి వివరించారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని, వారి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామన్న భట్టి, మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీలను కేటాయించబోతున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టితో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ బడ్జెట్ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత ఇచ్చారంటే? - BUDGET FOR SIX GUARANTEES 2024