Bandi Sanjay Prajahitha Yatra Comments : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర(Prajahitha Yatra) ప్రారంభమయింది. ఇందులో భాగంగా మొదటిగా కరీంనగర్‌లోని మహాలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌పై స్పందించారు.
Bandi Sanjay Reaction on Telangana Budget 2024 : బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణందా మోసం చేసిందని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లకు పైగా అవసరమవుతుందని అన్నారు. కాని కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదని తెలిపారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామన్న హమీని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
షరతులు విధించకుండా పథకాలను అమలు చేయాలి- బండి సంజయ్
Bandi Sanjay on PV Narasimha Rao : పీవీ నర్సింహారావును దారుణంగా కాంగ్రెస్ పార్టీ వంచించిందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన చనిపోతే కనీసం దిల్లీలో అంత్యక్రియలు కూడా చేయలేదని గుర్తు చేశారు. పీవీ ఘాట్‌ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం స్పందించలేదని ఆరోపించారు. పేదల కోసం యుద్దం చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. నరేంద్ర మోదీ(Narendra Modi)ని మళ్లీ మూడోసారి గెలిపించేందుకే ప్రజాహిత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఈ యాత్రను ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మోదీ కులంపై ప్రశ్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీమసీదు కడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 10 నుంచి బండి సంజయ్ పాదయాత్ర
"నేను నా జీవితాన్ని ప్రజల కోసమే ధారపోస్తున్నాను. నాకు సొంత వ్యాపారాల్లేవు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా దోచుకోలేదు. ప్రజాసంగ్రామ యాత్రతో రాష్ట్రమంతా తిరిగాను. ప్రజల కోసం కొట్లాడి 100కు పైగా కేసులు పెట్టినా భయపడలేదు. మేడిగడ్డ కూలిపోవడానికి కారణం స్వయం ప్రకటిత మేధావే. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు పొందిన సంస్థను బెదిరించి తన వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు."- బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ
Bandi Sanjay on Karimanagar Development : తాను ఏం చేశాడని ప్రశ్నించిన నేతలకు బదులు చెప్పిందుకే ప్రజాహిత యాత్ర ప్రారంభించానని బండి సంజయ్ తెలిపారు. ఎంపీగా ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. రూ.12 వేల కోట్లకుపైగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.590 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన ఘనత మోదీ సర్కార్‌దేనని హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నిధులన్నీ మోదీ సర్కార్‌దేనని అన్నారు. మేడిపల్లిలో రోడ్ల కోసమే రూ.20 కోట్లు కేంద్రం కేటాయించిందని వెల్లడించారు. ఆర్దిక సంఘం నిధుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులిచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) నుంచి ఎంపీలుగా చేసిన నేతలు కరీంనగర్ కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తొలిదశలో 119 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
బీఆర్ఎస్ నాయకులకు సర్పంచుల గురించి మాట్లాడే హక్కు లేదు : బండి సంజయ్