Bandi Sanjay Comments On KTR in Sircilla : కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తనను ఓడిచేందుకు ఓటుకు రూ. 1000 ఒక పార్టీ, రూ.2 వేల చొప్పున మరొక పార్టీ పంచుతున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. అయినా కరీంనగర్ ప్రజలంతా తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసగించినందునే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Hot Comments on KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరని బండి సంజయ్ విమర్శించారు. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తున్నారని మండిపడ్డారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తారా అని ప్రశ్నించారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తారా అని సవాల్ విసిరారు.
Bandi Sanjay Election Campaign in Sircilla : రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రంపై నింద వేయాలని కేసీఆర్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలిపారు. కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది మాజీ మంత్రి కేటీఆరేనని విమర్శించారు. కేసీఆర్తో కాంగ్రెస్ నేతలు కలిసిపోయి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే తనను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని పేర్కొన్నారు.
"సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. నేతన్నల దీన పరిస్థితికి కేసీఆర్, కేటీఆరే కారణం. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. నేతన్నకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని మోసగించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసగించినందునే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు."- బండి సంజయ్, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి