YSRCP attacks : ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలన అనంతరం తిరిగి వెళ్తున్న నానిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో దాడి చేయగా, ఓ బండరాయి నాని ఛాతికి బలంగా తగిలింది. ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని త్రుటిలో తప్పించుకోగా అడ్డుకున్న గన్‌మెన్ ధరణిపైనా దాడి జరిగింది. దీంతో ఆయన ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. వైఎస్సార్సీపీ మూకల దాడిలో నాని గన్‌మెన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు నాని కారును వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పులివర్తి నాని ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టీడీపీ శ్రేణుల ఆందోళన : దాడి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మహిళా వర్సిటీ వద్ద ఆందోళన చేపట్టాయి. చెవిరెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఘటనాస్థలికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో విశ్వవిద్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆందోళనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. సీఐ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. పోలీసు జులూం నశించాలంటూ నినాదాలు చేశారు.
ఏపీ ఎన్నికల విజయంపై జనసేన ధీమా - పవన్ మెజారిటీపై భారీ అంచనాలు - Janasena Party Confident on Winning
కారంపూడిలో అరాచకం: పల్నాడు జిల్లా కారంపూడిలో వైఎస్సార్సీపీ నేతల అరాచకం కొనసాగుతోంది. ఆ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి కారంపూడిలోని టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పేటసన్నెగండ్ల గ్రామానికి వెళ్తున్న పిన్నెల్లి.. అనుచరులతో కలిసి కారంపూడిలో భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఆ పార్టీ నేత జానీబాషా వాహనానికి నిప్పంటించారు. దాడులను నిలువరించేందుకు యత్నించిన కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అంతటితో ఆగకుండా బైకులను తగులబెట్టి, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.
తాడిపత్రిలో: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశాయి. సూర్యముని ఇంటిపై రాళ్లతో దాడికి దిగడంతో టీడీపీ కార్యకర్తలు దాడిని తిప్పికొట్టారు. వైఎస్సార్సీపీ మూకల దాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. దాడులపై ఫిర్యాదు చేయడానికి కార్యకర్తలతో కలిసి వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పరిసర ప్రాంతాల నుంచి భారీగా అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు.
ఓటరుపై దాడి ఘటన - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు - CASE BOOKED ON TENALI MLA IN AP