Jawahar Reddy on Door to Door Pension Distribution : పింఛన్ల పంపిణీపై ఈటీవీ, ఈనాడు కథనాలు సంచలనంగా మారాయి. ఈ విషయమై సోమవారం సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దనే పింఛను అందించాలనే నిర్ణయానికి మొగ్గుచూపారు. కానీ మురళీధర్‌రెడ్డి (Serp CEO Muralidhar Reddy) ఒక్కరే అది సాధ్యపడదని చెప్పినట్లు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోగానీ, ఆ శాఖ నిర్ణయాలతోనూ ఆయనకు సంబంధం ఉండదు. కేవలం పింఛన్ల నిధులు సమీకరించి విడుదల చేయడం, పంపిణీ తీరును పర్యవేక్షించడమే సెర్ప్ పరిధి. కానీ దానికి భిన్నంగా మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక ఉన్నతాధికారి చెప్పినట్టల్లా తలాడిస్తూ వైఎస్సార్సీపీకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మురళీధర్‌రెడ్డి వింత వాదన : సచివాలయ ఉద్యోగులు ఉండేది కేవలం పింఛన్ల పంపిణీ కోసమే కాదు. వారికి ఇతర పనులు కూడా ఉంటాయి, వారు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇచ్చేందుకు మ్యాపింగ్ వంటి సమస్యలు వస్తాయంటూ మురళీధర్‌రెడ్డి వింత వాదన తెరపైకి తెచ్చారు. ఎన్నికల సమయంలో నగదు పంపిణీ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా లేదు. ఇది తెలిసీ ఇతర పనులున్నాయనేలా బుకాయించడం మురళీధర్‌రెడ్డి ఉద్దేశాన్ని చాటుతోంది. ఇక వాలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయడం మహా అంటే రెండు మూడు గంటల పని. మ్యాపింగ్ సమస్యలున్నా అది గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చూసుకుంటుంది. ఆ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మురళీధర్‌రెడ్డి ఏ స్థాయిలో వైఎస్సార్సీపీకు వంత పాడేందుకు కంకణం కట్టుకున్నారో ఇట్టే అర్థమవుతోంది.
జగన్ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? : సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మురళీధర్‌రెడ్డి హంగామా చేస్తున్నారు. కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మరిచిపోయారా? అంతపెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా?అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పనా? బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు? ఆ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? వీటన్నింటికీ లేని ఇబ్బంది ఏ ఆదరువూ లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను ఇవ్వడంలోనే వచ్చిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వాలంటీర్ల బరితెగింపు : ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచే ప్రక్రియను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ పన్నిన ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడంలో మురళీధర్‌రెడ్డి మొదటి నుంచీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. 1వ తేదీకి ముందే పింఛన్ల నగదును సమీకరించుకునేందుకు అవకాశమున్నా పట్టించుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకు సెలవుల్ని సాకుగా చూపి ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 ఏప్రిల్‌లో ఇదే తరహా పరిస్థితి ఉన్నా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేం వచ్చింది? ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం 13 వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించింది. స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లకుండానే కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు, వారి అనుచర వర్గానికి బిల్లులు చెల్లించారు.
వృద్ధులపై మమకారముంటే అందులో నుంచి పింఛన్లకు అవసరమయ్యే 19 వందల 80 కోట్లు ఎందుకు పక్కన పెట్టలేదు? ఇదేమీ లేకుండానే మూడో తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చారు. కొంతమంది వాలంటీర్లు బరితెగించి వైఎస్సార్సీపీకు ప్రచారం చేస్తున్నారని తెలిసికూడా వారే ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తారని స్పష్టం చేశారంటేనే ఆయన వైఎస్సార్సీపీతో ఎంత అంటకాగుతున్నారో తెలిసిపోతోంది. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడితే దాన్ని తెదేపాకు ఆపాదించేందుకు వైఎస్సార్సీపీ పన్నిన కుతంత్రాన్ని అమలు చేసేలా పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి పింఛను పంపిణీ చేసేలా మురళీధర్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్ వన్‌గా ఉన్న ఓ ఉన్నతాధికారి ఆదేశాలకు అనుగుణంగానే సాగినట్టు ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.