Amit Shah Fake Video Case Investigation : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణాకే పరిమితంకాదని దేశం నలుమూలలా వ్యాపించిందని రాష్ట్ర హైకోర్టుకు దిల్లీ పోలీసులు నివేదించారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పలువురికి సమన్లు జారీ అయినట్లు తెలిపారు. మన్నె సతీశ్ తదితరులు వాస్తవాలు దాచి కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారని వాటిని తొలగించడం సహా అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ దిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దిల్లీ పోలీసుల తరఫున సృజన్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు.
Delhi Police Petition on Amit shah Case : పిటిషన్ వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పిటిషనర్ల మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ నుంచి వీడియో ట్విటర్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయినట్లుందని, అందువల్ల వారికి నోటీసులు జారీ చేశామన్నారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించకపోవడంతో దిల్లీ పాటియాల కోర్టును ఆశ్రయించి మన్నే సతీశ్, నవీన్, కోయ గీతలపై నాన్ బేయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిపారు. ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తేకుండా ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారన్నారు.
TS HC Investigation on Amit shah Video Case : కోయ గీత మొబైల్ ఫోన్ సీజ్ చేశామని అందులో కీలకమైన సమాచారం లభ్యమైందని పోలీసుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. అరుణ్ రెడ్డిని అరెస్ట్‌తో పలు సంచలన విషయాలు వెల్లడైనట్లు వివరించారు. రాష్ట్ర పోలీసులు ల్యాప్‌టాప్‌లు సీజ్ చేయడం వల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని తెలంగాణాలో నమోదైన కేసును దిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై మధ్యంతర ఉత్తర్వులు లేనప్పుడు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ 12కి వాయిదా వేశారు. దిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు మన్నే సతీశ్, ఆస్మా తస్లీం, శివకుమార్, నవీన్, కోయ గీత, వంశీ కృష్ణలు దాఖలు చేసిన పిటిషన్లో కఠిన చర్యలు తీసుకోరాదంటూ గత వారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.