Amalapuram Lok Sabha Constituency: అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు.
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:
ఇటీవల ఏర్పాటైన అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి.
- రామచంద్రాపురం
- ముమ్మిడివరం
- అమలాపురం(ఎస్సీ)
- రాజోలు(ఎస్సీ)
- పి.గన్నవరం(ఎస్సీ)
- కొత్తపేట
- మండపేట
2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:
- మొత్తం ఓటర్ల సంఖ్య- 15.11 లక్షలు
- ఓటర్లలో పురుషుల సంఖ్య- 7.50 లక్షలు
- మహిళా ఓటర్ల సంఖ్య- 7.60 లక్షలు
- ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 17
గతంలో లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన జీఎంసీ బాలయోగి 1991, 1998, 1999 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి చెందిన కేఎస్‌ఆర్ మూర్తి చేతిలో ఓటమిలపాలయ్యారు. 1962 ఉపఎన్నికలతో కలిపి ఈ నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 6 సార్లు, వైఎస్సార్సీపీ ఒకసారి విజయం సాధించాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంటి హరీశ్ మధుర్‌పై వైఎస్సార్సీపీకి చెందిన చింతా అనురాధ 39,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హరీశ్‌కు 36.68 శాతం ఓట్లు రాగా అనురాధ 39.95 శాతం ఓట్లు సాధించారు.
ప్రస్తుత ఎన్నికలకు బరిలో ఉన్న అభ్యర్థులు: ప్రస్తుతం టీడీపీ నుంచి గంటి హరీష్ పోటీ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి కుమారుడే అయినా తండ్రి మరణించాక వారి కుటుంబం చాలాకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంది. బాలయోగిపై ఉన్న అభిమానంతో గత ఎన్నికల్లో హరీష్‌కు వెతికి మరీ టీడీపీ టికెట్ ఇచ్చింది.
ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనకు నైతిక స్థైర్యాన్నిస్తూ ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలో దించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో గంటి హరీష్ అతి పిన్న వయస్కుడు. ఆయన వయసు 33 ఏళ్లే. మరోవైపు 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తి రాపాక వరప్రసాదరావు ఆ తర్వాత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఇప్పుడు ఆయన్నే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపింది.
గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే:
- 1957: కానేటి. మోహన రావు(సీపీఐ)
- 1962: బయ్య. సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్)
- 1967: బయ్య. సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్)
- 1971: బయ్య. సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్)
- 1977: కుసుమ. కృష్ణమూర్తి(కాంగ్రెస్)
- 1980: కుసుమ. కృష్ణమూర్తి(కాంగ్రెస్)
- 1984: ఎ.జె. వెంకట బుచ్చి మహేశ్వరరావు(టీడీపీ)
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:
- 1989: కుసుమ. కృష్ణమూర్తి(కాంగ్రెస్)- ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి(టీడీపీ)
- 1991: జి.ఎం.సి. బాలయోగి(టీడీపీ)- కుసుమ కృష్ణ మూర్తి(కాంగ్రెస్)
- 1996: కె.ఎస్.ఆర్. మూర్తి(కాంగ్రెస్)- జి.ఎం.సి బాలయోగి(టీడీపీ)
- 1998: జి.ఎం.సి. బాలయోగి(టీడీపీ)- కె.ఎస్.ఆర్ మూర్తి(కాంగ్రెస్)
- 1999: జి.ఎం.సి. బాలయోగి(టీడీపీ)- గొల్లపల్లి సూర్యరావు(కాంగ్రెస్)
- 2004: జి.వి. హర్ష కుమార్(కాంగ్రెస్)- జనార్దనరావు దున్నా(టీడీపీ)
- 2009: జి.వి. హర్ష కుమార్(కాంగ్రెస్)- పోతుల ప్రమీల దేవి(ప్రజారాజ్యం పార్టీ)
- 2014: పి. రవీంద్రబాబు(టీడీపీ)- పినిపే విశ్వరూపు(వైఎస్సార్సీపీ)
- 2019: చింతా. అనురాధ(వైఎస్సార్సీపీ)- గంటి హరీష్ మాధుర్(టీడీపీ)