Abhishek Manu Singhvi Nomination for Telangana Rajya Sabha : తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి శాసససభలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు.
అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలి : అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సింఘ్వీ వల్ల రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు. అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకువచ్చామని చెప్పారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్ గడువు : కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది. ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేదంటే వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అంతకుముందు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, అభిషేక్ సింఘ్వీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సీఎం వారందరినీ పార్టీ రాజ్యసభ ఉపఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు.
ఈ చట్టాన్ని పదేళ్లుగా కేంద్రం అమలు చేయలేదని చట్టంలోని అంశాలపై రాజ్యసభతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసమే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్ఠానాన్ని కోరామని తెలిపారు. సింఘ్వీ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తనవంతు తోడ్పడతానని వెల్లడించారు.
అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వానికి రాష్ట్ర కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్