Minister Uttam Kumar Reddy on Grain Purchases in Telangana : ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు న్యాయం చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాలు, తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాలు, తరుగు విషయంలో రైతులకు లాభం చేకూరుస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెపుతున్నారన్నారు. ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని ధ్వజమెత్తారు. రూ.42కు కిలో సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సన్నబియ్యంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, సన్నబియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని వివరించారు. మిల్లర్లపై రూల్స్ ప్రకారం పోయే ప్రభుత్వం తమదని చెప్పారు.
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదు : తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.1700 వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.2007 పలికిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు జరిగిందని చెప్పారు. మరి ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. కేంద్రీయ బండారును బ్లాక్ లిస్టులో పెట్టింది, తీసేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
"వారం రోజుల నుంచి బీఆర్‌ఎస్, బీజేపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖపై విమర్శలు చేస్తోంది. తాను రూ.1000 కోట్లు తీసుకున్నానని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ మాటలను వారు మళ్లించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందంట. ఆరోజు కొన్నది 30 లక్షల మెట్రిక్ టన్నులే. సన్న ధాన్యాన్ని ఇంత రేటుకు కొన్నారని చెప్పారు. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు. ఈ మాటలను స్వయంగా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్ అన్నారు." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి
అన్నదాతలతో మాట్లాడిన నేతలు - ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఫైర్ - Paddy Purchasing Centers Issue