Tamilnadu Election 2024 : తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళిసై సౌందరరాజన్. ఇప్పుడామె తమిళనాడులో అత్యంత కీలకమైన దక్షిణ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇది అధికార డీఎంకే పార్టీ సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎంపీగా డీఎంకే మహిళా నాయకురాలు తమిళచ్చి తంగపాండియన్ ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన జయవర్ధన్ అన్నాడీఎంకే అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం తమిళిసై సౌందరరాజన్, తమిళచ్చి తంగపాండియన్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రాజకీయ సమీకరణాలపై ఓ లుక్ వేద్దాం.
అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి
తమిళిసై సౌందరరాజన్ కేవలం తెలంగాణ గవర్నర్‌గానే చాలామందికి తెలుసు. కానీ, ఆమె బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి కీలక పదవులను పొందే స్థాయికి చేరిన తీరు గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. కానీ తమిళనాడు ప్రజలకు తమిళిసై రాజకీయ సత్తా ఏంటో బాగా తెలుసు. బీజేపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షురాలు వంటి ముఖ్యమైన పదవులను ఆమె గతంలో చేపట్టారు. బీజేపీకి బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేని తమిళనాడులో సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో పనిచేసి గుర్తింపును సాధించడం అంత సామాన్యమైన విషయం కాదు. డీఎంకే, అన్నా డీఎంకేతో తలపడి గెలిచే అవకాశాలు ఉండవని తెలిసినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా గతంలో ఆమె కనబర్చిన పోరాట పటిమ వల్లే కాషాయ పార్టీ అధిష్ఠానం పిలిచి మరీ గవర్నర్ పదవిని తమిళిసైకు కట్టబెట్టింది. అందుకే ఇప్పుడు తమిళిసై అడిగిన వెంటనే గవర్నర్ పదవి నుంచి రిలీవ్ చేసి, దక్షిణ చెన్నై లోక్‌సభ టికెట్‌ను కేటాయించింది. తనపై ఇంతగా నమ్మకం పెట్టుకున్న పార్టీ అంచనాలను అందుకునేందుకు తమిళిసై ఈ లోక్‌సభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార డీఎంకే అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌కు టఫ్ ఫైట్ ఇచ్చి తీరాలనే గట్టి పట్టుదలతో తమిళిసై ఉన్నారట. ఇందుకు అనుగుణంగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఆమె పావులు కదుపుతున్నారట.
గత ఎన్నికలు చెబుతున్నది ఇదే
దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం పరిధిలో ప్రస్తుతం దాదాపు 20 లక్షల ఓట్లు ఉన్నాయి. 2009 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేశన్‌కు ఈ స్థానంలో కేవలం 42వేల ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసిన గణేశన్‌కు అత్యధికంగా 2.58 లక్షల ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని అన్నా డీఎంకేకు వదిలేసింది. బీజేపీ మద్దతు ఉండటం వల్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌కు అత్యధికంగా 3 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే, బీజేపీ వేటికవిగా తలపడుతున్నాయి. మొత్తం మీద ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీకి తగినంత ఓటు బ్యాంకు ఉందనే విషయం స్పష్టం. స్థానిక, సామాజిక సమీకరణాలకు బలమైన ప్రచార వ్యూహం తోడైతే ఇక్కడి నుంచి తమిళిసై లోక్‌సభకు ఎన్నికవడం సాధ్యమయ్యే విషయమే.
తమిళచ్చి తంగపాండియన్‌కు అడ్వాంటేజ్‌లు ఇవీ
డీఎంకే అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌కు దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానంపై బలమైన పట్టు ఉంది. సిట్టింగ్ ఎంపీ కావడం ఆమెకు ప్లస్ పాయింట్. రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకే మద్దతు ఉండనే ఉంటుంది. రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు సోదరిగా బలమైన రాజకీయ నేపథ్యం తమిళచ్చి సొంతం. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఫీల్డ్ లెవల్‌లో తమిళచ్చికి ఓట్లు పడటంలో కీలకంగా సాయపడనున్నాయి. బీజేపీకి తమిళనాడులో ఇంత బలమైన మిత్రపక్షాలు లేవు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు చెందిన మక్కళ్ నీది మయ్యం పార్టీ అభ్యర్థి ఈ స్థానం నుంచి పోటీ చేసి 1.35 లక్షల ఓట్లు సాధించారు. ఈ సారి కమల్ హాసన్ కూడా డీఎంకే పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇది తమిళచ్చి తంగపాండియన్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది.
జయవర్ధన్‌కు తమిళిసై పెద్ద సవాల్
అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్థన్ వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2014లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డు జయవర్థన్‌కు ఉంది. అప్పట్లో ఆయన 26 ఏళ్ల చిన్న వయసులోనే లోక్‌సభలోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయకుమార్ తనయుడు కావడం వల్ల ఈయనకు స్థానికంగా మంచి ప్రజాదరణ ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయవర్థన్‌కు 3,02,649 ఓట్లు పడగా, తమిళచ్చి తంగపాండియన్‌కు 5,64,872 ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ, పీఎంకే, డీఎండీకే, పుదియ నీతి కట్చి వంటి పార్టీలు ప్రస్తుతం వారితో లేవు. ఈసారి అన్నాడీఎంకే ఓట్లను బీజేపీ చీల్చనుంది. ఇది జయవర్ధన్‌కు మైనస్ పాయింట్‌గా మారనుంది. బీజేపీ నుంచి తమిళిసై లాంటి బలమైన అభ్యర్థి రంగంలోకి దిగడం అన్నాడీఎంకేకు పెద్ద షాకే.
ముక్కోణపు పోరులో తమిళనాట గెలుపెవరిది? 2019 రిజల్ట్స్ రిపీట్ అవుతాయా? - Tamilnadu Election 2024
మోదీ గ్యారంటీ Vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారెంటీ- 2024 యుద్ధం షురూ- టాప్ 10 ప్రచార అస్త్రాలివే!