pratidwani On Govt Job Recruitment : ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కొలువుల భర్తీలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తలమునకలై ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నిర్వహణ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరీశీలించారు. ఎంపికైన వారికి సంబంధిత బోర్డులు నియామక పత్రాలు అందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య ఎంత? ఏటా పోటీ పరీక్షలకు కొత్తగా ఎంతమంది సిద్ధమవుతున్నారు? ఈ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తుంది? ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల కారణాలతో ఆరు నెలల కాలం గడిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది? బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో ఏం ఆలోచిస్తోంది? అనే విషయాలపై ఈ రోజుటి ప్రతిధ్వని కార్యక్రమం.
MLC Balmoori Venkat On JOb Notifications : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ప్రతి పరీక్షను కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడానికి చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. అన్ని విభాగాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను కూడా అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందని వివరించారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని అభ్యర్థుల్లో విశ్వాసం కలిగించే విధంగా గ్రూప్-1ను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఇటీవల టెట్ క్వాలిఫై అయిన వారికి డీఎస్సీకి ఫీజు తీసుకోకుండా పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థులకు చెప్పిన విధంగానే ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నామన్నారు.