Musi Riverfront Development Project in Telangana : కాలుష్య మూసీని ప్రక్షాళన చేసేందుకు, హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక ఆకర్షణ మలిచే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మురికి మూసీ బాగుపడితే చూడాలని ఎదురుచూస్తోన్న ఎంతోమందిలో ఈ పరిణామాలు కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. థేమ్స్ నది స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పానికి అనుగుణంగా నిధుల అన్వేషణ, విధానపరమైన నిర్ణయాల్లో కనిపిస్తోన్న వేగమే అందుకు కారణం. మరి వందల ఏళ్ల హైదరాబాద్ నగర చరిత్రకు సాక్షిగా నిలిచే మూసీని అంతే అందంగా తిరిగి ముస్తాబు చెయ్యాలంటే ఇప్పుడు అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి?ఎస్టీపీల నిర్మాణం, బఫర్ జోన్ ఖరారు, గోదావరి జలాల తరలింపుతో పాటు ఇంకా ఏం చేస్తే మూసీని అనుకున్న కొత్తరూపంలో చూడొచ్చు? ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని.
మూసీ నది అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్లో రూ. 1500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, ఆ నిధులతో మూసీ నది తీరప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ, వ్యర్థాలతో ఏళ్ల తరబడి మూసీనది కాలుష్య కోరల్లో చిక్కిందని తెలిపిన ప్రభుత్వం, దాన్ని సవాల్ తీసుకొని ప్రక్షాళన దిశగా కార్యచరణ మొదలుపెట్టింది.
మూడు ప్యాకేజీలుగా 39 ఎస్టీపీలను నిర్మించనున్న సీవరేజ్ బోర్డు : అందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను మూడు ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలువకుండా చేయాలని నిర్ణయించింది.
అందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో ఒక ఎస్టీపీ, హామ్ పద్దతిలో 1878 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, 1906 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది. ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే 972 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనున్నారు.