Loksabha Elections BJP Vs Congress : ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఇక దిల్లీ నుంచి గల్లీ దాకా దేశం నలుమూలలా ప్రచారంతో మోత మోగించనున్నాయి. పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించి లక్కును పరీక్షించుకోనున్నాయి. ఇక రాజకీయ పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉండనే ఉంటాయి !! ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పొలిటికల్ పార్టీలు ఈ సారి ఎన్నికల ప్రచారంలో భుజాలకు ఎత్తుకోనున్న కీలకమైన 10 అంశాలను ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం.
1. మోదీ కీ గ్యారంటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఆధారంగా నడుస్తున్న హామీ 'మోదీ కీ గ్యారంటీ'! ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బాగానే వర్కౌట్ అయింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించకుండానే ప్రధాని మోదీ ఒంటరిగా ప్రచార రథాన్ని లాగారు. ప్రతీ సభలోనూ 'మోదీ కీ గ్యారంటీ'ని నమ్మండి అని ప్రజలకు చెప్పారు. ఈ నినాదం బాగానే ఓట్లను రాల్చింది.
ఫలితంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కూడా బీజేపీకి అకౌంట్లోకి వచ్చేశాయి. అందుకే సార్వత్రిక ఎన్నికల్లోనూ దీనికి బీజేపీ టాప్ ప్రియారిటీ ఇవ్వనుంది. యువత, మహిళలు, రైతులు, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు 'మోదీ కీ గ్యారంటీ' అనే ట్యాగ్‌ను విరివిగా వాడుతున్నారు.
2. కాంగ్రెస్ 'న్యాయ్' హామీలు
'నారీ న్యాయ్' పేరుతో మహిళలకు 5 కీలక హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అర్హులైన నిరుపేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థికసాయం అందించే జనాకర్షక స్కీమ్ కూడా వీటిలో ఉంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ యాత్రలోనూ ఈ హామీలను బాగానే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఈ హామీలన్నింటినీ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది. ఈ సారి ఎన్నికల్లో ఉచిత హామీలపైనే హస్తం పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. గెలుపోటములను అవే డిసైడ్ చేస్తాయని భావిస్తోంది.
3. నిరుద్యోగం, ధరల మంట
యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగులు లక్ష్యంగా ప్రచారానికి కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం వంటి కనీస సమస్యలను తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని అంటోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను ప్రకటిస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. దేశంలో నిత్యావసరాల ధరలను అదుపులోకి ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతామని ఆయన చెబుతున్నారు. రేషన్ షాపుల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని హస్తం పార్టీ చెబుతోంది.
4. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, యూసీసీ
ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను కేంద్రంలోని బీజేపీ సర్కారు నిలబెట్టుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ తొలి అడుగు వేసింది. రానున్న రోజుల్లో గుజరాత్, అసోం కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశంలో యూసీసీని అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్లానింగ్ చేయనుంది. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావించకుండానే బీజేపీకి కశ్మీర్‌పైనే తప్ప కశ్మీరీలపై ప్రేమ లేదు అనే కోణంలో కాంగ్రెస్ విమర్శలకు దిగే ఛాన్స్ ఉంది. సీఏఏ, యూసీసీలకు వ్యతిరేకంగా హస్తం పార్టీ, ఇతర విపక్షాలు గర్జించనున్నాయి.
5. అయోధ్య రామమందిరం
ఈ ఏడాది జనవరి 22న అంగరంగ వైభవంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. స్వయంగా ప్రధాని మోడీ రామయ్య విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించారు. దేశంలోని హిందువుల శతాబ్దాల కలను సాకారం చేసిన నాయకుడిగా ప్రధానిని బీజేపీ క్యాడర్ ప్రజల్లో చూపించనుంది.
ఉత్తరాదిలో ఈ సెంటిమెంట్ మంచి ఫలితం ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఉత్తర భారతదేశంలోని 413 లోక్‌సభ సీట్లలో కనీసం 300 తమకే వస్తాయన్న ధీమాతో బీజేపీ ఉంది. దక్షిణాది సీట్లను కలుపుకుంటే 370 దాకా సాధిస్తామనే విశ్వాసంతో కమలదళం ఉంది.
6. ఎలక్టోరల్ బాండ్స్ చిట్టా
ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల చిట్టాపై ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతోంది. ఈవిధంగా పార్టీలు సేకరించిన విరాళాల్లో సగానికి సగం (దాదాపు రూ.6 వేల కోట్లు) ఒక్క బీజేపీకే వచ్చాయి. దీన్నిబట్టి దేశంలోని కార్పొరేట్ కంపెనీల నుంచి ఏ రేంజ్‌లో బీజేపీకి విరాళాలు వెల్లువెత్తాయో అంచనా వేయొచ్చు. దీనిపై విపక్షాలు ప్రతిచోటా మాట్లాడే ఛాన్స్ ఉంది.
కేంద్రంలోని మోడీ సర్కారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇంతగా విరాళాలను సేకరించిందని విపక్షాలు ఇప్పటికే తూర్పారాబట్టడం మొదలుపెట్టాయి. ఈ డబ్బులను వాడుకొని కొన్ని రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
7. అమృత్ కాల్ వర్సెస్ అన్యాయ్ కాల్
మోడీ ప్రభుత్వం 2047 వరకు ఉండే అమృత్ కాల్ గురించి మాట్లాడుతోంది. అప్పటివరకు మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి అవుతాయి. 2047 వరకు మన దేశానికి డెవలప్ అయిన కంట్రీగా మారుస్తానని ప్రధాని మోదీ పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు నడుస్తున్న అమృత కాలంలో దేశం వికాసం కోసం ప్రతి ఒక్కరు శ్రమించాలని ఆయన పిలుపునిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ సహా విపక్షాలు గత పదేళ్ల మోడీ పాలనా కాలాన్ని అన్యాయ్ కాల్‌గా విమర్శిస్తున్నాయి. ఈ వ్యవధిలో బీజేపీ వల్ల కూలిన రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలను చూపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు, పెట్రోలు ధరలు పెరిగిపోయిన తీరును ప్రజలకు విపక్షాలు వివరిస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరు, పేదరికాన్ని తగ్గించడం, ఉచిత రేషన్ పథకం, వివిధ నగదు బదిలీ సంక్షేమ పథకాలు వంటి వాటితో విపక్షాలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది.
8. రైతుల సమస్యలు, ఎంఎస్పీపై చట్టపరమైన హామీ
గత నెలలో దిల్లీ సరిహద్దులు అట్టుడికాయి. పంజాబ్, హరియాణా, యూపీ రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. తమ సమస్యలను పరిష్కరించి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారాల తరబడి రైతులు నిరసన తెలిపినా కేంద్రం పట్టించుకోలేదు. ఆయా రాష్ట్రాల్లో రైతుల అంశాన్ని విపక్షాలు ఈసారి ఓట్లుగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
తాము గెలిస్తే ఎంఎస్పీపై చట్టం చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. రైతుల ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. బీజేపీ మాత్రం దిల్లీ బార్డర్‌లో జరిగిన రైతుల నిరసనలను రాజకీయ కోణంలో చూస్తోంది. వాటి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపిస్తోంది. పీఎం-కిసాన్ పథకం, రైతులకు ప్రయోజనం చేకూర్చే ఇతరత్రా సంక్షేమ పథకాలతో విపక్షాలను కౌంటర్ చేసేందుకు బీజేపీ యత్నించనుంది.
9. సైద్ధాంతిక ఘర్షణ
ఈ ఎన్నికలు వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక యుద్ధం జరగనుంది. లౌకిక వాదం పేరుతో కాంగ్రెస్ జాతీయవాద హిందుత్వం పేరుతో బీజేపీ తలపడనున్నాయి. చారిత్రక వైభవాన్ని కాపాడుకుంటూ, దేశాన్ని వికాస పథంలో తీసుకెళ్లడమే తమ లక్ష్యమని బీజేపీ అంటోంది. కులమతాలకు తావు లేకుండా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదే వాదనను ఇరు పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి.
10. 'వికసిత్ భారత్' విజన్
అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటున్నారు. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు. వికసిత భారత్ సాధన కోసం తమ వద్ద ఉన్న ఎజెండాను ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేపడుతున్న చర్యలను వివరించనుంది. అయితే ప్రతిపక్షాలు 'వికసిత్ భారత్' నినాదాన్ని ఒట్టిమాటగా అభివర్ణిస్తున్నాయి. ఇలాంటి మాటలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని అంటున్నాయి.
2024 లోక్‌సభ పోల్స్: ఎన్డీఏ Vs ఇండియా- మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?
నిరుద్యోగులే కాంగ్రెస్ టార్గెట్- రాహుల్ 5హామీలపై హస్తం పార్టీ మెయిన్ ఫోకస్