Bengal Election Battle Modi and Didi : అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ నుంచి విమర్శల నేపథ్యంలో బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. విపక్ష ఇండియా కూటమితో జట్టుకట్టినా బంగాల్‌లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న దీదీ, మోదీకి షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటి బంగాల్లో బీజేపీ ఆటలు సాగనివ్వబోనని చాటి చెప్పాలని మమతా పట్టుదలతో ఉన్నారు.
2019లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 22 స్థానాల్లో టీఎంసీ, 18 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో టీఎంసీ అధికారంలో ఉన్నా, భారతీయ జనతా పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఈసారి టీఎంసీ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని బీజేపీ, 30కుపైగా స్థానాలు దక్కించుకోవాలని దీదీ పార్టీ పట్టుదలగా ఉన్నారు. కానీ టీఎంసీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతుండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఇది బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. శాంతిభద్రతలు, అవినీతి, మహిళలపై అఘాయిత్యాలు, పౌరసత్వ సవరణ చట్టం అమలు వంటి అంశాల్లో మమత తీరుపై కమలం పార్టీ ఘాటుగా విమర్శలు సంధిస్తోంది. 2019లో సాధించిన 18 స్థానాలకంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి 2026 శాసనసభ ఎన్నికల నాటికి బెంగాల్లో మరింత బలపడాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
రెండంకెల కోసం కాంగ్రెస్ కష్టాలు
మరోవైపు గత ఎన్నికల్లో రెండే స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధమైంది. విపక్ష ఇండియా కూటమితో పొత్తుకు మమత కలిసి వస్తుందని ఆశించినా అది జరగలేదు. అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమత ప్రకటనతో హస్తం పార్టీ కూడా ఒంటరిపోరుకే సిద్ధమైంది. ఈసారి రెండంకెల స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన వామపక్షాలతో హస్తం పార్టీ పొత్తు చర్చలు జరుపుతోంది. బంగాల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రాభావాన్ని చాటి చెప్పడానికి కాంగ్రెస్-వామపక్షాలకు ఈ ఎన్నికలకు చాలా కీలకంగా మారనున్నాయి.
దీదీ బ్రహ్మాస్త్రాలు అవే!
బంగాల్లో సీఎం మమతా బెనర్జీకి విస్తృతమైన ప్రజాదరణ ఉండడం టీఎంసీకి కలిసిరానుంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఇంతటి ప్రజాదరణ పొందిన నేత లేకపోవడం ఆ పార్టీకి లోటుగా మారింది. సువేందు అధికారి ఉన్నా మమతతో పోటీ పడే విషయంలో ఆయన వెనకడుగులోనే ఉన్నారు. బంగాల్లో తృణమూల్‌కు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఓటర్లలో 50 శాతం ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలు టీఎంసీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాల్లో అనుమానాలు పెరిగాయి. ముఖ్యంగా బంగాల్‌గా 30 శాతంగా ఉన్న మైనార్టీ ఓటర్లు టీఎంసీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మమత ప్రచారాన్ని సాగిస్తున్నారు. సీఏఏ వలసదారులను తప్పుదారి పట్టించే చట్టమంటూ దీదీ తీవ్ర విమర్శలు చేస్తూ మైనార్టీల ఓట్లపై కన్నేశారు. సీఏఏ తన ఎన్నికల ప్రచారంలో కీలక అస్త్రంగా దీదీ ప్రయోగిస్తున్నారు.
మమతను కలవరపెడుతున్న అంశాలు
అయితే సీనియర్లు-జూనియర్ల మధ్య టీఎంసీలో ఆధిపత్య పోరు నడుస్తుండడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. అవినీతి ఆరోపణలు TMC ప్రతిష్ఠను దిగజార్చాయి. అభ్యర్థి ఎంపికపై అంతర్గత విభేదాలు అసంతృప్తి బహిర్గతమయ్యాయి. సందేశ్‌ఖాలీలో TMC నేతలు లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడ్డారని మహిళలు ఆరోపించడం కూడా ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీ నిరసనలు సందేశ్‌ఖాలీలో టీఎంసీ మహిళల ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. తృణమూల్ నేతల అవినీతిని బీజేపీ ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. పాఠశాలలు, పౌర సంస్థలలో రిక్రూట్‌మెంట్ స్కామ్‌లు, ఆహార ధాన్యాల పంపిణీలో అక్రమాలు, పశువుల స్మగ్లింగ్‌లో TMC అగ్ర నాయకులు జైల్లో ఉండడం ఆ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మోదీ కరిష్మాపై బీజేపీ ఆశలు
తృణమూల్ కాంగ్రెస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తామిచ్చిన నరేగా నిధులను మమత సర్కార్ ప్రజలకు అందజేయకుండా నిలిపేసిందని కాషాయ దళం ఆరోపిస్తోంది. నరేంద్ర మోదీ మానియాను వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై బంగాల్ కమలం శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం అమలు ప్రయోజనాలను వివరిస్తోంది. బంగాల్లో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, అవినీతి, సందేశ్‌ఖాలీ ఘటనలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బంగాల్లో RSSకు బలమైన మద్దతు ఉండడం కూడా కమలం పార్టీకి కలిసిరానుంది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారి పోయింది. శాసనసభ ఎన్నికల తర్వాత చాలామంది బీజేపీ నేతలు టీఎంసీ గూటికి చేరారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కూడా అసమ్మతి వ్యక్తమైంది. బంగాల్లో బలమైన నేత లేకపోవడం కూడా బీజేపీకు ఇబ్బందికరంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో TMCని ఢీకొట్టడానికి ముందు జరిగే సెమీఫైనల్స్‌గా బీజేపీ ఈ ఎన్నికలను చూస్తోంది.
పూర్వవైభవం కోసం వామపక్షాలు- పొత్తుకోసం కాంగ్రెస్
మరోవైపు, కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. పూర్వ వైభవం సాధించేందుకు తహతహలాడుతున్నాయి. 2021 శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్- వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా పొత్తుకు ఇరు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా లోక్‌సభ ఎన్నికల కోసం ఇరుపక్షాల మధ్య పొత్తు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్-వామపక్షాల పొత్తు ఇరు పార్టీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. టీఎంసీ-బీజేపీకు వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వారికి ఈ మూడో ఫ్రంట్ ప్రత్యామ్నాయం కానుంది. మైనార్టీలు ఈ పొత్తు వైపు చూసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్- వామపక్షాల పార్టీల ప్రభావం బంగాల్లో పూర్తిగా తగ్గిపోవడం ఆ రెండు పార్టీలకు ప్రతికూలంగా మారింది.
దీదీ, మోదీ యుద్ధం- లాభం వారికే!
అయితే బంగాల్లో ఈ రెండు పార్టీలకు బలమైన నాయకులు లేరు. ఈ ఎన్నికల్లో కాస్తైనా ప్రభావం చూపి 2026లో జరిగే శాసనసభ ఎన్నికల నాటికి ప్రజా మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్-వామపక్షాలు చూస్తున్నాయి. బంగాల్‌లో ఉనికిని నిరూపించుకోవడానికి ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నికలు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. లెఫ్ట్ -కాంగ్రెస్ తగిన సంఖ్యలో సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే బంగాల్లో ఈ రెండు పార్టీల ఉనికి పూర్తిగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. బంగాల్లో దీదీ-మోదీ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము లాభ పడాలని వామపక్షాలు-కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇద్దరు ప్రత్యర్థుల రాజకీయ కుమ్ములాట తమకు కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. తమది మూడో రాజకీయ శక్తి అని, తాము సత్తా చాటుతామని కాంగ్రెస్-కమ్యూనిస్టులు చెబుతున్నారు. TMC, BJPలు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయని చర్యలు మాత్రం చేపట్టడం లేదని విమర్శిస్తున్నాయి.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే అది బంగాల్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీయవచ్చన్న అంచనాలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తే. టీఎంసీ పాలన సజావుగా సాగే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పలు ముందస్తు సర్వేలు కూడా బంగాల్‌లో టీఎంసీ కంటే బీజేపీకు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దిల్లీ మద్యం కేసులో ఆప్‌నకు షాక్- మరో మంత్రికి ఈడీ సమన్లు - Kailash Gahlot Ed Summons
లోక్‌సభ బరిలో 15మంది మాజీ సీఎంలు- ఎన్డీఏ నుంచే 12మంది పోటీ - EX CMS IN LOK SaBHA ELECTIONS 2024