Wheat Flour Badusha Recipe at Home: బయట క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా, జ్యూసీగా ఉండే బాదుషా.. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అయితే బాదుషాలు తినాలంటే బయట స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకోవాల్సిందేనని చాలా మంది భావిస్తారు. కానీ ఇవి తయారుచేయడం చాలా సులభం. సరైన కొలతలతో పిండిని కలుపుకుంటే బాదుషాలు చక్కగా వస్తాయి. మరి.. గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి - 1 కప్పు
- ఉప్పు - చిటికెడు
- బేకింగ్ పౌడర్ - అర చెంచా
- నెయ్యి - రెండు చెంచాలు
- నీరు - సరిపడా
- నెయ్యి - డీప్ ఫ్రైకి సరిపడా
పాకం కోసం:
- పంచదార - 1 కప్పు
- నీరు - 1 కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- పటిక - చిటికెడు
పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ!
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ఉప్పు, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ సమయంలో పిండి పట్టుకుని ఒత్తితే ముద్దలాగా అయ్యిందంటే బాగా కలుపుకున్నట్టు. అలా రాలేదంటే మరోసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఓ 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత తడి క్లాత్ కప్పి లేదా మూత పెట్టి ఓ పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం పాన్ పెట్టి పంచదార, నీరు పోసి పంచదార కరిగించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి, పటిక వేసుకుని పాకం జిగటగా మారేంతవరకు కలుపుకోవాలి. అంటే గులాబ్జామున్ పాకానికి ఎక్కువగా.. తీగ పాకానికి తక్కువగా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకుని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అందులో ఒక ఉండను తీసుకుని రౌండ్‌గా చేసుకుని కొద్దిగా వెడల్పు అని బాదుషా షేప్‌లో చేసుకోవాలి. ఇలా మిగిలిన ఉండలను కూడా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి కొన్ని బాదుషాలను నూనెలో వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా.. అవి పైకి తేలేంతవరకు సిమ్‌లోనే ఉంచుకోవాలి. బాదుషాలు నూనె పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
- ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాదుషాలను గోరువెచ్చని పంచదార పాకంలో వేసి ఓ రెండు గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకుని పాకంలో వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత సర్వ్ చేసుకుని తింటే మాటలు ఉండవ్. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపించేత బాగుంటాయి. అయితే.. ఇవి చేయడం మొదటి సారి అయితే తక్కువ పిండితో చేసుకోవడం మంచిది.
ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండి తిన్నారా! తింటే వదిలిపెట్టరు - పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు
నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా హల్వా" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి!