Nizamuddin of Tenali Typewriting Artist Drawing Amazing Images Through His Typewriter : ప్రతి ఒకరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. నిరంతర సాధనతో ఆ ప్రతిభకు పదును పెట్టుకుంటే మంచి స్థాయికి చేరుకోవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవచ్చు. అందుకు ఉదాహరణే ఈ యువకుడు. చిన్నతనంలోనే తన ఆసక్తికి మెరుగులు దిద్దుకున్నాడు. చిత్రకళలో ఎలాంటి శిక్షణ లేకపోయినా తనదైన శైలి సృష్టించుకున్నాడు. టైప్‌రైటర్‌తో అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తూ వహ్వా అనిపిస్తున్నాడు.
టైప్‌మెషిన్‌తో బొమ్మలు వేస్తున్న ఈ యువకుడి పేరు షేక్ నిజాముద్దీన్. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఇతడు డిగ్రీ పూర్తిచేశాడు. తండ్రి కూడా చిత్రకారుడే కావడంతో తానూ అలాగే బొమ్మలు గీయాలని అనుకునేవాడు. మూడో తరగతిలో డ్రాయింగ్ టీచర్ తన బొమ్మ వేశాక ఆ సంకల్పం మరింత బలపడిందంటున్నాడు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో బొమ్మలు వేయడం సాధన చేసేవాడు.
కళాకృతులు చెక్కింది - రాతను మార్చుకుంది - Pencil Artist india Book of Records
డిగ్రీ ముందు వరకూపెన్సిల్‌తో చిత్రాలు గీసేవాడు నిజాముద్దీన్. వివిధ చిత్రపోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులూ సాధించాడు. ఎక్కడకు వెళ్లినా అలాంటి చిత్రకారులే వందలాది మంది రావడం తనని ఆలోచనలో పడేసింది. అదే సమయంలో టైప్ రైటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న నిజాముద్దీన్‌కు టైప్ రైటర్‌తో బొమ్మలు వేస్తే ఎలా ఉంటుందనే సరికొత్త ఆలోచన వచ్చింది.
అనుకున్నదే తడవుగా ఆన్‌లైన్‌లో టైప్‌రైటింగ్ ఆర్ట్ గురించి వెతికాడు నిజాముద్దీన్. ఈ కళకు 120 ఏళ్ల చరిత్ర ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. మరుగున పడుతున్న ఈ ఆర్ట్‌పై పట్టు సాధించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. కానీ అదేమంత సులువు కాలేదు. సొంత టైప్ రైటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నిజాముద్దీన్. అతికష్టమ్మీద కన్నవాళ్ల సహకారంతో పాత టైప్ రైటర్ సంపాదించి ఈ ఆర్ట్‌లో మెళకువలు నేర్చుకున్నాడు.
'పెన్సిల్, పెయింటింగ్ వాడి బొమ్మలు వేయడానికి, టైప్ రైటర్ చిత్రాలకు చాలా తేడా ఉంటుంది. పెన్సిల్‌తో గీసేటప్పుడు పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. టైప్ రైటర్‌తో అలా వీలు కాదు.' -షేక్ నిజాముద్దీన్, చిత్రకారుడు
టైప్ రైటర్ ద్వారా ఎందరో నాయకులు, సినీతారల చిత్రాలకు ప్రాణం పోశాడు నిజాముద్దీన్. గాంధీజీ, నేతాజీ, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్, షారూఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను ఆవిష్కరించాడు. ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్‌తోనూ అదిరిపోయే చిత్రాలు సృష్టిస్తున్నాడు. కుటుంబపోషణే కష్టంగా ఉన్నా కుమారుడి ఆసక్తి గమనించి ప్రోత్సహిస్తున్నామని అంటున్నాడు నిజాముద్దీన్ తండ్రి. చదువుకుంటూనే బొమ్మలు వేయగా వచ్చిన ఆదాయంతో తమ కుటుంబానికి కుమారుడు ఆసరాగా నిలుస్తున్నాడని చెబుతున్నాడు. టైప్ రైటర్ ఆర్టిస్ట్‌గానే కాక పేపర్ కటింగ్, త్రెడ్ ఆర్ట్‌లోనూ ప్రతిభ చూపుతున్నాడు నిజాముద్దీన్. ఔట్‌లైన్ లేకుండా టైప్ రైటర్‌తో బొమ్మలు గీసేందుకు ఓ ప్రోగ్రాంనూ రూపొందిస్తున్నాడు. టైప్ రైటర్ ఆర్టిస్ట్‌గా వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా సాగుతున్నాడు ఈ యువ చిత్రకారుడు.