Tomato Pachadi Recipe in Telugu : పచ్చళ్లు అనగానే ఎక్కువ మందికి ఆవకాయతో పాటు ముందుగా గుర్తొచ్చేది టమాటా పచ్చడి. చాలా మంది దీన్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పడూ రొటీన్ మాదిరిగా కాకుండా ఓసారి ఇలా 'టమాటాలు ఉడకబెట్టకుండా పచ్చడిని' ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు. మాకు వంట రాదు బాబోయ్ అనే వాళ్లు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు - అర కేజీ
- చింతపండు - నిమ్మకాయంత
- కారం - తగినంత
- వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 12
- రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
- వేయించిన మెంతుల పొడి - పావు టీస్పూన్
- వేయించిన ఆవాల పొడి - పావు టీస్పూన్
తాలింపు కోసం :
- నూనె - ముప్పావు కప్పు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- మినప పప్పు - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఎండుమిర్చి - 6
- కరివేపాకు - 3 రెమ్మలు
- ఇంగువ - పావు టీస్పూన్
- పసుపు - అరటీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా టమాటాలను తొడిమె భాగం తొలగించి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే చింతపండు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆవాలు చిటపడలాడే వరకు వేయించుకున్నాక అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి పోపును చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక ఆ మిశ్రమంలో ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో పచ్చడిని గరిటెతో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకునేటప్పుడు అందులో వేయించిన మెంతుల పొడి, ఆవాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం ద్వారా పచ్చడికి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చడిని ఉడికించుకునే క్రమంలో ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి.
- పచ్చడిలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపి చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత ఏదైనా గాలి చొరబడని గాజు కంటైనర్ లేదా జార్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "టమాటా పచ్చడి" రెడీ!
- ఈ పచ్చడిని మామూలుగా స్టోర్ చేసుకుంటే కనీసం వారం పాటు నిల్వ ఉంటుందట. అదే ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు 20 రోజుల వరకు ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది!
ఇవీ చదవండి :
వింటర్ స్పెషల్ : ఘుమఘుమలాడే "టమాటా కొత్తమీర సూప్" - వేడివేడిగా గొంతులోకి జారుతుంటే అదుర్స్!
అన్నం, రోటీ, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ - నోరూరించే "టమాటా మసాలా కర్రీ" - ఈజీగా చేసుకోండిలా!