Srivari AngaPradhakshina Tokens Lucky Dip: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను.. ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. ఆరోజు సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారని సూచించింది.
ఇలా లక్కీడిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు వారి మొబైల్‌కు మెసేజ్ రూపంలో అధికారులు సమాచారం అందిస్తారు.. అలాగే ఆన్‌లైన్‌లో కూడా వివరాలు నమోదు చేస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500/- డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన భక్తులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపించి అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది. అంగప్రదక్షిణ అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది.
భక్తులకు TTD బిగ్ అలర్ట్ - తిరుమల కొండపై నీళ్లు కొన్ని రోజులే సరిపోతాయ్! - అలా చేయాల్సిందేనట!
అంగప్రదక్షిణ పద్ధతి ఇదే: అంగప్రదక్షిణ చేసే భక్తులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద దుస్తులతోనే మూడు మునకలు వేసి అలాగే తడి వస్త్రాలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్లాలి. బుకింగ్ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం.. భక్తులను సెక్యూరిటీ ఆలయం లోపలికి అనుమతిస్తారు.
వేంకటేశ్వరునికి సుప్రభాత సేవ మొదలైన తరవాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతినిస్తారు. దాదాపు తెల్లవారుజాము 3 గంటల సమయంలో మొదట స్త్రీలను అంగప్రదక్షిణ కోసం పంపుతారు. తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. తర్వాత భక్తులను స్వామివారి వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెడతారు. స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి దగ్గరకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన పురుషులను వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చోబెడతారు. ఇంతలో శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది. దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే అంగప్రదక్షిణ భక్తులకు అనుమతిస్తారు.
ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి??: ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది.
సంప్రదాయ దుస్తులు: అయితే అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. చీరలు, లంగా వోణీ వంటివి ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా ధరించాల్సి ఉంటుంది. షార్ట్, ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్, చొక్కా, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరించి వెళ్లే భక్తులను అంగప్రదక్షిణకు అనుమతించరు.
శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్ - వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో వారికి గదుల కేటాయింపు రద్దు!
తిరుమల వెళ్లేవారికి అలర్ట్: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు - భక్తులకు TTD సూచన!