Thotakura Karam Curry in Telugu : ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ ఎక్కువ మంది తినే వాటిలో పాలకూర, తోటకూర వంటివి తప్పనిసరిగా ఉంటాయి. అయితే, మీరు ఇప్పటి వరకు తోటకూరతో ఎక్కువగా పప్పు, ఫ్రై వంటి రెసిపీలు ప్రిపేర్ చేసుకుని ఉంటారు. కానీ, ఈసారి కాస్త డిఫరెంట్‌గా "తోటకూర కారం" కర్రీని ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా! పైగా దీని కోసం ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? వంటి వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- తోటకూర - 5 చిన్న కట్టలు
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- వెల్లుల్లి రెబ్బలు - 6
- జీలకర్ర - అరటీస్పూన్
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- పోపు గింజలు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్‌వి)
- కరివేపాకు - 2 రెమ్మలు
- టమాటాలు - 3(మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా తోటకూరను తెంపి శుభ్రంగా కడిగి నీళ్లు పోయే వరకు జల్లి గిన్నెలో వేసి పెట్టుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా తోటకూరను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆపై కట్ చేసుకున్న తోటకూరను ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన పచ్చికారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు తినే కారానికి తగినట్లు పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పోపు గింజలు(ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు) వేసుకొని ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఆపై ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్‌గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే అందులో కరివేపాకూ వేసుకొని వేపుకోవాలి.
- తాలింపు చక్కగా వేగిందనుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. అంటే.. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది.
- పచ్చిమిర్చి మిశ్రమం వేగాక.. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, టమాటాలు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు, తోటకూర కాస్త మగ్గే వరకు ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దని గుర్తుంచుకోవాలి.
- నాలుగైదు నిమిషాలు ఉడికించుకున్నాక ఉప్పు, పసుపు వేసుకొని కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద మిశ్రమంలో కొద్దిగా ఆయిల్ సేపెరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అందుకోసం సుమారు 10 నుంచి 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
- ఆవిధంగా ఉడికించుకున్నాక చివర్లో ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించుకుని దింపేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "తోటకూర కారం కర్రీ" రెడీ!
ఇవీ చదవండి :
బంధువులు వస్తే చికెన్, మటన్ కంటే - ఇలా "పాలకూర ఉల్లికారం" చేసి పెట్టండి! - ఇష్టంగా తింటారు!