Copper Bottles Cleaning Tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని కాపర్ బాటిల్స్ యూజ్ చేస్తుంటారు. అయితే, ఈ బాటిల్స్‌ని రెగ్యులర్‌గా వాడడం వల్ల గాలిలో ఆక్సిజన్‌తో చర్య జరిపి రంగు మారిపోవడం, అడుగున ఆకుపచ్చగా తయారవుతుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది రాగి బాటిల్స్‌ను నార్మల్ వాటిలానే క్లీన్ చేస్తుంటారు. దాంతో లోపల సరిగ్గా క్లీన్ అవ్వవు. ఫలితంగా వాటిని అలానే వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, కాపర్ బాటిల్స్‌ని ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు. అందుకోసం కొన్ని క్లీనింగ్ టిప్స్ కూడా సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మరసం, ఉప్పు : కాపర్ బాటిల్/కాపర్ పాత్రల్ని శుభ్రం చేయడంలో నిమ్మరసం, ఉప్పు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు తీసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై దాన్ని ఆయా పాత్రలపై వేసి సాఫ్ట్ క్లాత్‌తో రుద్దడం ద్వారా అవి ఈజీగా క్లీన్ అయి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు నిపుణులు. ఇక బాటిల్ లోపలి భాగాన్ని క్లీన్ చేయడానికి ఈ మిశ్రమాన్ని ద్రావణంగా చేసుకొని యూజ్ చేయాలి.
ఉప్పు, వెనిగర్ : వీటి మిశ్రమం రాగి బాటిల్స్ క్లీనింగ్‌లో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్ది మొత్తాల్లో ఉప్పు, వెనిగర్ తీసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాటిల్ ఉపరితలంపై రుద్దడంతో పాటు.. ద్రావణంలా చేసి బాటిల్ లోపలి భాగాన్ని క్లీన్ చేయాలి. ఫలితంగా బాటిల్ పూర్వపు రంగులోకొస్తుందంటున్నారు.
చింతపండు : ఈ చిట్కా కూడా కాపర్ బాటిల్స్‌ను మెరిపించడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం చింతపండు రసంలో కొద్దిగా ఉప్పు వేసి బాటిల్‌లో పోయాలి. కాసేపటి తర్వాత షేక్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇదే చింతపండు గుజ్జుతో బాటిల్ బయటి భాగాన్నీ శుభ్రం చేసుకోవచ్చంటున్నారు.
వేడి నీరు : రాగి బాటిల్‌లో కాస్త వేడిగా ఉన్న వాటర్‌ని పోసి అందులో కొద్దిగా ఉప్పు, రెండు నిమ్మ చెక్కలు, కాస్త వెనిగర్ వేసి.. 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి. నీళ్లు చల్లారాక.. కాటన్ క్లాత్‌తో లోపలి భాగాన్ని క్లీన్ చేసుకుంటే చాలు. ఫలితంగా బాటిల్స్ మురికి వదిలి కొత్తవాటిలా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు!
- రాగి బాటిల్స్‌ని పదిహేను రోజులకోసారి శుభ్రం చేయడం వల్ల అవి ఎప్పుడూ కొత్త వాటిలా ఉండడమే కాకుండా.. క్లీన్‌గానూ ఉంటుంది. లేదంటే రుద్ది మరీ కడగాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
- అదేవిధంగా.. కాపర్ బాటిల్స్ క్లీనింగ్‌కి కాస్త వేడిగా ఉన్న వాటర్‌ని యూజ్ చేస్తే అవి త్వరగా శుభ్రపడతాయి.
- బాటిల్స్ లోపలి భాగాన్ని కడిగే క్రమంలో గరుకుగా ఉండే బ్రష్‌లు యూజ్ చేయకూడదు. అలాగే బయటి భాగానికీ స్క్రబ్బర్లు వాడకపోవడమే బెటర్. ఎందుకంటే వీటివల్ల బాటిల్‌పై గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మృదువైన కాటన్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవడం మంచిదంటున్నారు.
- అన్ని పాత్రల్లా వీటిని క్లీన్ చేశాక గాలికి ఆరబెట్టకూడదు. కడిగిన వెంటనే పొడి వస్త్రంతో తుడవడం వల్ల అవి ఆక్సిడేషన్ ప్రక్రియకు లోను అవ్వవు. ఫలితంగా బాటిల్‌పై నీటి మరకలు పడకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
కాపర్ బాటిల్‌లో వాటర్ తాగుతున్నారా? - ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!