Side Effects of Room Heaters : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంటోంది. ఈ చలికాలంలో వెచ్చదనం కోరుకునే వారు బెడ్రూమ్స్లో బొగ్గుల కుంపటిని ఉంచడమో.. రూమ్ హీటర్‌ని వాడటమో చేస్తుంటారు. అయితే.. ఇలాంటివి చలిని తరిమికొట్టడం వరకు బాగానే పనిచేసినా.. ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మరణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు! ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
వెచ్చదనం కోసం మంచం కిందో.. గదిలో ఓ మూలనో బొగ్గుల కుంపటిని ఉంచడం చాలా మంది చేసేదే. అయితే వెంటిలేషన్ లేని గదిలో ఇలా ఉంచడం ప్రమాదమంటున్నారు నిపుణులు. బొగ్గులు మండినప్పుడు వాటి నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని.. ఈ విషవాయువు రక్తంలోని హీమోగ్లోబిన్‌తో కలిసిపోయి.. ఫలితంగా శరీరభాగాలకు సరిగా ఆక్సిజన్ సరఫరా కాదని, దీంతో మెదడుకు ఆక్సీజన్ అందక ఊపిరాడదంటున్నారు. అందుకే వీటిని గదిలోకి తేకపోవడమే మేలని వివరిస్తున్నారు.
అయితే.. మేం వాడేది రూమ్ హీటర్ కాబట్టి పర్లేదు అనుకుంటారు కొందరు. కానీ.. అదీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. చర్మం పొడిబారడం, కళ్ల మంటలు వంటివన్నీ రూమ్‌హీటర్ చలవే. రోజులో కొద్దిసేపు వాడేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయని.. రోజుల తరబడి రాత్రంతా వాడేవారికి నిద్రలోనే చనిపోయే (అస్‌ఫిక్సీయా) ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే.. రూమ్హీటర్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవుతుంది. అందుకే వెచ్చదనం కోసం ఉపయోగించుకున్నా.. అది కొద్దిసేపటికే పరిమితమవ్వాలని, కాస్త పరిమితి పెరిగినా తలనొప్పి, కళ్లు తిరగడం, కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. మరీ మితిమీరితే చావుకీ దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
2019లో "సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" రూపొందించిన నివేదిక ప్రకారం.. రూమ్ హీటర్లు, ఇతర ఇంధనంతో నడిచే పరికరాల నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్.. యునైటెడ్ స్టేట్స్‌లో సంభవించిన పలు మరణాలకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. అధికారిక వెబ్సైట్లో కార్బన్ మోనాక్సైడ్ అధికంగా పీల్చడం వల్ల కలిగే నష్టాలను ప్రచురించింది. (రిపోర్ట్ కోసం క్లిక్ చేయండి).
ఈ సమస్యలు కూడా:
చర్మం పొడిబారడం: చలికాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారిపోతుంటుంది. అయితే.. రాత్రి మొత్తం గదిలో హీటర్లు వేసుకొని పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందంటున్నారు నిపుణులు. హీటర్ నుంచి వెలువడే వేడి వాతావరణంలో ఉన్న ఆ కాస్త తేమను కూడా తొలగించి గాలిని పొడిగా మార్చుతుందని.. ఇక ఇదే గాలి రాత్రంతా శరీరానికి తాకడం వల్ల చర్మం తేమను కోల్పోయి.. దురద, మంట, అలర్జీ.. వంటివి వస్తాయంటున్నారు. ఇక సెన్సిటివ్ చర్మం కలిగిన వారు, చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందంటున్నారు.
రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం: బయట చలిగా ఉన్నప్పుడు గదిలో హీటర్ వేసుకుంటే ఎంతో వెచ్చగా ఉంటుంది. అలాగని ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చోవడం కుదరదు. పనుల రీత్యా చలిలో తిరగక తప్పదు. అయితే ఈ క్రమంలో అప్పటిదాకా వెచ్చదనంలో ఉన్న శరీరం ఒక్కసారిగా చల్లటి వాతావరణంలోకి, చలిలో గడిపిన తర్వాత వెంటనే హీటర్ వేడికి.. ఇలా వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల ప్రభావం మనలోని రోగనిరోధక వ్యవస్థపై పడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం.. తద్వారా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. అందుకే అత్యవసరమైతేనే.. అది కూడా తక్కువ సమయం వాటిని ఉపయోగించడంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని సెట్ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే ఒంట్లో వెచ్చదనం పెంచే ఆహారం, ఉన్ని దుస్తులు వంటివాటిపై ఆధారపడటం మేలంటున్నారు.
పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం కొనుగోలు చేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే మంచిది!
చలి పులి వచ్చేసింది - శ్వాసకోస సమస్యలు తెచ్చేసింది - ఈ జాగ్రత్తలతో చెక్ పెట్టండిలా!