Best Foods for Protein: మంచి ఆరోగ్యం, కండ పుష్టి కావాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే.. విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అన్ని సమపాళ్లలో ఉండే విధంగా రోజువారి ఆహారం ఉండాలి. అంతేకాదు.. ఆహారంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్నప్పుడే శారీరక శక్తి, కండరాల దృఢత్వం పెరుగుతుంది. అయితే, ప్రొటీన్ల కోసం చాలా మంది ఎక్కువగా చికెన్, కోడి గుడ్లు వంటి వాటిపై ఆధారపడుతుంటారు. అలాకాకుండా ఈ గింజలను డైలీ డైట్లో చేర్చుకున్నా నాన్వెజ్ కంటే ఎక్కువగానే ప్రొటీన్ పొందవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి మాంసాహార పదార్థాల్లో ప్రొటీన్లు(Protein) దండిగా ఉంటాయి. అయితే, వీటిల్లో కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. అలాగే కోడిగుడ్డులోనూ ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి, అలాకాకుండా ఈ సీడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.
జనపనార విత్తనాలు : ఈ గింజల్లో ఫైటోకెమికల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేవలం 100 గ్రాముల జనపనార విత్తనాల్లో సుమారు 21 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందట. వీటిని పొడిగా లేదా నానబెట్టుకుని తినొచ్చు. ముఖ్యంగా వీటిలోని అధిక ప్రొటీన్ ఆకలిని అదుపు చేయడంతో పాటు జీవక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.
వాల్ నట్స్ : వీటిలో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.100 గ్రాముల వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా సుమారు 26 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చట. కాబట్టి, మీరు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉంటే డైలీ వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
ఎగ్స్లోనే కాదు- అంతకుమించిన ప్రొటీన్స్ ఈ కూరగాయల్లో!
గుమ్మడి గింజలు : వీటిని సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ గింజల్లో ఎ, బి, సి, ఇ విటమిన్‌లతో పాటు ఫైబర్, ప్రొటీన్, ఐరన్, అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలూ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. 2019లో "The American Journal of Clinical Nutrition"లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. సీడ్స్, సోయా ఉత్పత్తులు, పప్పులు అనేవి మాంసం ఆధారిత ప్రొటీన్‌లకు సమానమైన పోషణను అందిస్తాయని కనుగొన్నారు.
రాజ్మా గింజలు : కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్ గింజల్నే రాజ్మా గింజలుగా పిలుస్తాం. చిక్కుడు జాతికి చెందిన వీటిల్లో ప్రొటీన్స్తో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా డైలీ కిడ్నీ బీన్స్(Health Direct రిపోర్టు) తగిన మొత్తంలో తీసుకోవడం ద్వారా మాంసాహారం కంటే ఎక్కువే ప్రొటీన్ పొందవచ్చంటున్నారు.
బాదం గింజలు : వీటిలో కూడా ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి నాన్వెజ్ తినని వారు డైలీ కొన్ని బాదం గింజలను ఆహారంగా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. 100 గ్రాముల బాదం గింజల్లో సుమారు 23 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని చెబుతున్నారు డాక్టర్ లహరి.
కాబూలీ శనగలు : మీరు డైలీ డైట్లో ఏదో ఒక విధంగా కాబూలీ శనగలు తీసుకున్నా శరీరానికి కావాల్సిన ప్రొటీన్ కంటెంట్ లభిస్తుందంటున్నారు డాక్టర్ లహరి. 100 గ్రాముల శనగల్లో దాదాపు 23 గ్రాముల వరకు ప్రోటీన్లు లభించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇవేకాకుండా.. మీ రోజువారి ఆహారంలో సోయా సంబంధిత ఫుడ్స్, పాల సంబంధిత ఉత్పత్తులు చేర్చుకోవడం ద్వారా కూడా మాంసాహారం కంటే ఎక్కువ ప్రొటీన్ పొందవచ్చంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : కండలు పెంచేందుకు ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? - ఏం జరుగుతుందో మీకు తెలుసా?