Legal Advice on Family Problem : ఓ మహిళ కుటుంబ సమస్య ఇది. ఆమె ఆడపడుచు వాళ్లింటి సమీపంలోనే కాపురం చేస్తోంది. దీంతో.. చీటికి మాటికి పుట్టింటికి వచ్చేస్తోందట. తన ఇంట్లో వంట చేయకపోయినా, తనకి సరిగా నిద్రలేకపోయినా కూడా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేస్తోందట. దీంతో తనకు పనిభారం పెరిగి క్రమంగా ఆరోగ్యం దెబ్బతిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. రోగిష్టిదాన్ని తెచ్చుకున్నామంటూ అత్తామామలు తిండుతున్నారట.
ఇటు ఆమె భర్త కూడా తాగొచ్చి "నా చెల్లి నీకు భారమైందా" అంటూ కొడుతున్నాడట. ఓసారి ఈ దెబ్బలు భరించలేక ఫ్రెండ్ ఇంటికీ పారిపోయింది. ఇంకోసారి ఇలా వెళ్తే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు భర్త. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? కేసు పెడితే న్యాయం జరుగుతుందా? అంటూ న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. మరి, ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీపై పెరుగుతోన్న పనిభారాన్ని.. మీ భర్త, అత్త, ఆడపడుచులు గుర్తించాల్సింది. అలాగే.. ఆడపడుచు పుట్టింటికి రావడం తప్పుకాదు కానీ, మీ పనుల్లో సాయపడితే బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒకరు చెప్పాల్సినవి కాదు. ఇక.. మీ భర్త తాగొచ్చి మిమ్మల్ని కొట్టడం సరికాదు. ఇది గృహహింస కిందకి వస్తుంది. మీరు దెబ్బలు తింటూ భరించాల్సిన పనిలేదు. ఏదైనా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కి వెళితే మీ సమస్య పరిష్కారం కావొచ్చు. లేదంటే.. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కంప్లయింట్ చేయండి. వాళ్లు మీ భర్తను పిలిచి కౌన్సెలింగ్ చేసి మీ సమస్యకు పరిష్కారం చూపొచ్చు అని వరలక్ష్మి సూచిస్తున్నారు.
"ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, లీగల్ సర్వీసెస్ అథారిటీలో కంప్లయింట్ చేసినా మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే.. గృహహింస నిరోధక చట్టం-2005 కింద ప్రొటెక్షన్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేస్తే సరి. అప్పుడు వారు మీ అత్త, ఆడపడుచు, భర్త అందరినీ పిలిచి బుద్ధి చెబుతారు. అక్కడా మీ ప్రాబ్లమ్ కొలిక్కి రాకపోతే కేసు కోర్టుకి వెళ్తుంది."- జి. వరలక్ష్మి, న్యాయవాది
అప్పుడు మీరు న్యాయస్థానంలో రక్షణ(సెక్షన్-18), ఇంట్లో నివసించే హక్కు (సెక్షన్-19), మీకూ, మీ పిల్లలకు రావాల్సిన వైద్య, నెలసరి ఖర్చులు (సెక్షన్-20), అనుభవిస్తోన్న శారీరక, మానసిక క్షోభకు పరిహారం(సెక్షన్-22) వంటివి కోరవచ్చు. తర్వాత కోర్టు మీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మాట్లాడాక మీకు తగిన న్యాయం జరిగేలా చూస్తుందని సలహా ఇస్తున్నారు న్యాయ నిపుణులు జి. వరలక్ష్మి.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
'నన్ను పెళ్లి చేసుకున్నాడు - ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు' - చట్టం ఎలాంటి సాయం చేస్తుంది??