How to Make Kodiguddu Vellulli Karam : గుడ్డు.. మంచి సంపూర్ణ పోషకాహారం. చాలా మంది ఫ్రిజ్‌లో ఎగ్స్ ఉన్నప్పుడు బుర్జీ, ఎగ్ పులుసు, కర్రీ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. మరికొందరు మార్నింగ్ ఎగ్స్‌ని ఉడికించుకొని తింటుంటారు. అయితే.. ఎప్పుడూ ఒకేలా తినడం బోరింగ్‌గా ఉంటుంది. అందుకే ఈసారి తెలంగాణ స్టైల్లో 'కోడిగుడ్డు వెల్లుల్లి కారం' ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది! ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం పొడి కోసం :
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- వెల్లిల్లిపాయ - 1(పెద్దసైజ్‌లో ఉన్నది)
- ఉప్పు - 1 స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
కోడిగుడ్డు కారం కోసం :
- గుడ్లు - 5
- నూనె - తగినంత
- పోపు దినుసులు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఉల్లిపాయలు - 2(పెద్ద సైజ్‌లో ఉన్నవి)
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - పావు టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు(జీలకర్ర, ఆవాలు, మినప పప్పు, శనగ పప్పు) వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి తుంచి వేసుకొని పోపు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ విధంగా వేయించుకున్నాక.. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
- ఆపై స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్‌గా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఆవిధంగా ఉడికాయనుకున్నాక.. కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని ఆనియన్స్ పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- మిశ్రమాన్ని ఉడికించుకున్నాక.. గరిటతో ఉల్లిపాయ ముక్కలను పక్కకు జరిపి పాన్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఏర్పాటు చేయాలి.
ఈ స్నాక్స్ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!
- ఇప్పుడు ఆ గ్యాప్‌లో కోడిగుడ్లను పగులకొట్టి వేసుకోవాలి. కోడి గుడ్డు కాస్త ఉడికిందని అనుకున్నాక.. పక్కనున్న ఆనియన్స్‌తో కలపకుండా కేవలం గుడ్డు మిశ్రమాన్ని మాత్రమే గరిటతో అలా ఒక్కసారి కలుపుకొని వదిలేయాలి. లేదంటే అడుగున మాడిపోతుంది.
- తర్వాత స్టౌ లో-ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు మూత తీసి ఎగ్స్ మిశ్రమాన్ని తిప్పుకొని రెండో వైపు కాసేపు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మొత్తం గరిటెతో కలుపుకోవాలి. కోడిగుడ్డు కాస్త డ్రైగా మారే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే కోడిగుడ్డు కారం త్వరగా పాడవ్వకుండా రెండు రోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది.
- ఇక కోడిగుడ్డు ముక్కలు మంచిగా వేగి క్రిస్పీగా మారాయనుకున్నాక.. ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత వెల్లుల్లి కారం ఎగ్స్ ముక్కలన్నింటికీ పట్టేలా కలుపుతూ వేయించుకోవాలి. ఇందుకు రెండు నుంచి మూడు నిమిషాల టైమ్ పట్టొచ్చు.
- ఇక చివరగా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "కోడిగుడ్డు కారం" రెడీ!
ఫ్లఫ్పీ ఆమ్లెట్ : ఇతర పదార్థాలేమీ అవసరం లేదు - పెద్ద సైజ్ బన్లాగా పొంగుతుంది - ఇలా ప్రిపేర్ చేయండి!