Independence Day 2024 Special Sweets: ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఈ శుభవేళ అందరూ నోరు తీపి చేసుకుంటారు. అయితే.. ఈ సందర్భంలో నోరూరించే మిఠాయిలను మూడు రంగుల్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? జెండా పండుగ మరింత అద్భుతంగా ఉంటుంది! మరి.. ఆ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొబ్బరి లడ్డూలు:
కావలసినవి:
- కొబ్బరి తురుము- ఒకటిన్నర కప్పు
- కండెన్సెడ్ మిల్క్-పావుకప్పు
- యాలకుల పొడి-పావుటీస్పూన్
- పాలు-రెండు టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం:
- పావు కప్పు కొబ్బరి తురుమును పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి అందులో మిగతా కొబ్బరి తురుము, కండెన్స్‌డ్ మిల్క్, యాలకుల పొడిని వేసి వేడిచేయాలి.
- తక్కువ మంట మీద కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి.
- పాలు పోసి మరికాసేపు ఉంచిన తర్వాత చల్లార్చాలి.
- ఈ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలు చేయాలి.
- ఒక భాగంలో ఆరెంజ్, మరో భాగంలో పచ్చ రంగు ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత మూడు రంగులను లడ్డూలుగా చుట్టుకోవాలి.
- ప్లేటులో ముందుగా ఆరెంజ్, తర్వాత తెలుపు, చివరగా పచ్చరంగు లడ్డూలను అమర్చాలి. అంతే మూడు రంగుల లడ్డూలు చూడముచ్చటగా భలే ఉంటాయి.
తిరంగా బర్ఫీ:
కావలసిన పదార్థాలు:
- వేపుడు శనగలు- రెండు కప్పులు
- పంచదార - కప్పు
- బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు- పది చొప్పున
- యాలకుల పొడి-చిటికెడు
- నెయ్యి-నాలుగు టేబుల్‌స్పూన్లు
- మీగడ-పావుకప్పు
- చిక్కటిపాలు-అరకప్పు
- ఆరెంజ్‌ఫుడ్ కలర్ - టీస్పూన్
- గ్రీన్‌ఫుడ్‌కలర్-టీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా వేపుడు శనగలను పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ మిక్సీజార్ తీసుకుని అందులోకి పంచదార, బాదం, జీడిపప్పు పలుకులను వేసి పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- తర్వాత అదే మిక్సీజార్‌లో శనగలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ వెడల్పాటి గిన్నెలో ఈ రెండు పొడులను వేసి నెయ్యి, మీగడ వేసి బాగా కలపాలి. మీగడ బదులు మిల్క్‌పొడర్ కూడా వేసుకోవచ్చు.
- కొంచెం కొంచెంగా పాలు పోస్తూ పిండిని ముద్దలా చేయాలి. దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి.
- ఒకదాంట్లో ఆరెంజ్‌ఫుడ్‌కలర్, మరోదాంట్లో గ్రీన్‌ఫుడ్‌కలర్ వేసి బాగా కలపాలి.
- ప్లేటుకు నెయ్యి రాసుకోవాలి. ముందుగా పచ్చరంగు ముద్దను వేసుకుని ప్లేటు నిండా పరచాలి. తర్వాత తెల్లని ముద్దను, చివరగా ఆరెంజ్ రంగులో ఉన్న ముద్దను వేసి సమానంగా పరచాలి. ఆపై జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు చల్లి గంటపాటు కదపకుండా పక్కన పెట్టేయాలి.
- తర్వాత చాకుతో నచ్చిన షేప్‌లో ముక్కలు చేసుకోవాలి. అంతే ముచ్చటైన మూడు రంగుల బర్ఫీ రెడీ.
తిరంగ లడ్డూ:
కావాల్సిన పదార్థాలు:
- బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పు
- పాలు - మూడు కప్పులు
- పంచదార - ఒకటిన్నర కప్పు
- యాలకుల పొడి - పావు టీ స్పూన్
- నెయ్యి - తగినంత
- ఆరెంజ్ ఫుడ్ కలర్ వాటర్ - అర టీ స్పూన్
- గ్రీన్ ఫుడ్ కలర్ వాటర్ - అర టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి.
- నెయ్యి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేవరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దానిని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి.
- పాలు మరిగిన తర్వాత వేయించుకున్న బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఇప్పుడు మంట సిమ్‌లో పెట్టి రవ్వ దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి పంచదార వేసుకుని కలుపుకోవాలి.
- పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి మరోసారి కలుపుకోవాలి. రవ్వ మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మూడు ప్లేట్స్‌లోకి సమాన భాగాలుగా తీసుకోవాలి.
- ఇప్పుడు ఒక ప్లేట్లోని రవ్వ మిశ్రమంలో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
- మరో ప్లేట్లోని రవ్వ మిశ్రమంలో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఇంకో ప్లేట్లో ఎటువంటి కలర్ కలపనవసరం లేదు.
- ఇప్పుడు ఏదైనా షేప్‌లో ఉండే బాక్స్ తీసుకుని లోపల మొత్తం నెయ్యి రాసుకోవాలి.
- ఇప్పుడు ఆ బాక్స్‌లో ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ కలర్ రవ్వ మిశ్రమం వేసుకుని సమానంగా పరచాలి.
- ఆ తర్వాత మామూలు రవ్వ మిశ్రమం వేసుకుని దానిని అలానే పరచాలి.
- అనంతరం ఆరెంజ్ కలర్ రవ్వ మిశ్రమం వేసుకుని దానిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఈ బాక్స్‌ను ఓ 15 నిమిషాలు పక్కన ఉంచి.. ఆ తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే తిరంగా రవ్వ లడ్డూ రెడీ..
నోరూరించే సేమ్యా హల్వా - తిన్నారంటే మాయమైపోతారు!
శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!