How to Reduce Oil in Cooking : ఏ వంటకమైనా కమ్మగా తయారవ్వాలంటే.. ఉప్పు, కారంతోపాటు కాస్త ఆయిల్ ఎక్కువగానే ఉండాలని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే కూరలు, పచ్చళ్ల తాలింపులో నూనె అధికంగా వినియోగిస్తుంటారు. అయితే.. ఈ రెసిపీలు ఆ సమయంలో తిన్నప్పుడు నోటికి రుచిగానే అనిపించినా.. దీర్ఘకాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా వంటల్లో నూనెను అధికంగా వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. మనం ఉపయోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఫ్యాట్స్ ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఏ వంటలోనైనా ఆయిల్ వాడకాన్ని తగ్గించుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. మరి.. నూనె వాడకం ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ టిప్స్ పాటించండి :
- ఫ్రై కర్రీలకు బదులు బేకింగ్, స్టీమింగ్‌కు ప్రాధాన్యమివ్వండి. దీంతో ఎ, డి, కె-విటమిన్లు బాడీకి పుష్కలంగా అందుతాయి.
- అలాగే ఫ్రైడ్ స్నాక్స్‌కి బదులు రోస్ట్ చేసిన, లేదా స్టీమ్ చేసిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
- వంట చేసే క్రమంలో నూనె ఎక్కువగా కాకుండా ఉండడానికి.. డైరెక్ట్‌గా బాటిల్‌లో నుంచి నూనెను పోసే బదులు టీస్పూన్ లాంటి వాటితో ఆయిల్ వేయండి. ఇలా చేస్తే కూరలో ఆయిల్ తక్కువగా ఉపయోగించవచ్చు.
- ఎప్పుడూ ఒకే ఆయిల్‌ను కాకుండా కాంబినేషన్ నూనెలను వాడితే మంచిది. సన్‌ఫ్లవర్, నువ్వులు, రైస్ బ్రాన్, వేరుశెనగ, కొబ్బరి నూనెల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి చాలా అవసరం.
- మన బాడీ వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి బాడీకి అందుతాయి. అందుకే వేరు వేరు ఆయిల్స్‌ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
- మనలో చాలామందికి అప్పడాలంటే ఎంతో ఇష్టం. కానీ ఇవి వేయించాలంటే చాలా ఆయిల్ కావాలి. దీని కారణంగా అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆవిరైపోతాయి. కాబట్టి అప్పడాలని సన్నటి మంట పైన కాల్చుకుంటే నూనె వాడాల్సిన అవసరమే ఉండదు.
- ఆయిల్ వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక బుక్‌లో రాసుకోండి. అప్పుడు మీకు ఓ అవగాహన వస్తుంది. దీన్ని బట్టి అవసరం అనుకుంటే ఈ చిట్కాల ద్వారా ఆయిల్ వాడకాన్ని తగ్గించవచ్చు.
- వేపుళ్లకి వాడిన ఆయిల్‌ని మళ్లీ వేయించడానికి యూజ్ చేయకండి. ఇందువల్ల మన బాడీలోకి ట్యాక్సిన్స్ చేరే ప్రమాదం ఉంది.
- వంట నూనెను ఎక్కువసేపు వేడి చేస్తే అందులో ఉండే విటమిన్లు బాడీకి అందవు. అంతేకాదు.. ఒకసారి వాడిన ఆయిల్‌ని ఎక్కువసార్లు వాడకూడదట.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే వాడిన ఆయిల్ తో ఫ్రెష్ నూనెను కలపకండి.
- ఆయిల్‌ని వేడి చేసినప్పుడు వాటి ఉష్ణోగ్రత కూడా మారుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద నూనె పొగ రావడం మొదలు పెడుతుందో దానిని 'స్మోకింగ్ పాయింట్' అంటారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రత్యేకించి వేపుళ్లు చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోకింగ్ పాయింట్ ఉన్న ఆయిల్‌ను మాత్రమే వాడాలి.
- ఒకసారి ఉపయోగించిన నూనెను మరోసారి వాడే ముందు పాత్రలో అడుగున ఉన్న నూనెను వదిలేస్తే మంచిది. లేదంటే వడగట్టుకుని యూజ్ చేయాలి.
- వంట నూనెపై సన్‌లైట్ పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడడం వల్ల ఆయిల్లో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
బిగ్ అలర్ట్ : రోడ్ సైడ్ టిఫిన్ చేస్తున్నారా? - క్యాన్సర్ ముప్పు తప్పదట!
ఆహార పదార్థాలు వేయగానే నూనె పొంగుతోందా? - అయితే అది కచ్చితంగా కల్తీదే