Matar Paneer Gravy Recipe in Telugu: పనీర్ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. పనీర్‌ను సరిగ్గా వండితే.. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే విధంగా ఉంటుంది. కేవలం కూర మాత్రమే కాకుండా దీంతో పాలక్ పనీర్, కడాయి పనీర్, టిక్కా, పనీర్ బటర్ మసాలా లాంటి ఎన్నో రకాల వంటలను చేస్తుంటారు. ఇవే కాకుండా వీటితో చేసే స్వీట్లు, స్నాక్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే.. ఈ సారి "మటర్ పనీర్ గ్రేవీ" ప్రిపేర్ చేద్దాం. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
- ఒక టీ స్పూన్ నూనె
- 2 లవంగాలు
- ఒక ఇంచు దాల్చిన చెక్క
- 2 బిర్యానీ ఆకులు
- అర ఇంచు అల్లం
- 7 వెల్లుల్లి పాయలు
- 2 ఉల్లిపాయలు
- 3 టమాటాలు
- 5 బాదం
- 8 పిస్తాలు
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీ స్పూన్ పసుపు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో నెయ్యి, నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అల్లం, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఇవన్నీ వేగాక టమాటా ముక్కలు, నానబెట్టిన బాదం, పిస్తాలు వేసుకుని కలపాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సుమారు 8 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించుకోవాలలి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి అందులో నుంచి బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క తీసేయాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
పనీర్ కోసం కావాల్సిన పదార్థాలు
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- 200 గ్రాముల పనీర్
- 2 పచ్చిమిరపకాయలు
- అర టీ స్పూన్ ధనియాల పొడి
- అర టీ స్పూన్ జీలకర్ర పొడి
- పావు టీ స్పూన్ గరం మసాలా
- ఒక టీ స్పూన్ కారం
- అర కప్పు బఠానీలు (నానబెట్టినవి)
- ఒక టీ స్పూన్ కసూరి మెతి
- పావు టీ స్పూన్ చక్కెర (ఆప్షనల్)
- కొద్దిగా కొత్తిమీర
- అర టీ స్పూన్ నిమ్మ రసం
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పనీర్ వేసి సుమారు 2 నిమిషాలు పాటు అన్ని వైపులా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- అందులోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కలిపి కాసేపు వేయించుకోవాలి.
- అనంతరం అందులోనే పచ్చి బఠానీలు వేసి బాగా కలిపి.. గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు అవసరమైన మేర కొద్దిగా నీళ్లు కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత మూత తీసి ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలు, కసూరి మెతిని వేసి బాగా కలపాలి. (మీకు నచ్చితే ఇప్పుడు చక్కెర వేసుకోవచ్చు)
- కాసేపయ్యాక కొత్తిమీర, నిమ్మ రసం పోసి కలిపాక స్టౌ ఆఫ్ చేస్తే సూపర్ టేస్టీ మటర్ పనీర్ గ్రేవీ రెడీ!