Manchurian Recipe With Leftover Rice: సాధారణంగా మన ఇళ్లలో ప్రతిరోజూ చాలా అన్నం మిగిలిపోతుంటుంది. అయితే.. కొందరు మహిళలు వీటితో వడియాలు లాంటి ఇతర పదార్థాలు చేసుకుంటారు. కానీ ఇలా చేయాలంటే కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుంది. అందుకే.. త్వరగా పూర్తయ్యే మంచూరియా చేసేయండి. ఎంతో అద్భుతంగా ఉండే ఈ రెసిపీ తయారికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచూరియా కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు అన్నం
- ఒక ఉల్లిపాయ ముక్కలు
- రెండు పచ్చిమిరపకాయలు
- ఒక క్యాప్సికం ముక్కలు
- ఒక క్యారెట్ తరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీ స్పూన్ కారం
- అర టీ స్పూన్ ధనియాల పొడి
- పావు టీ స్పూన్ జీలకర్ర పొడి
- అర కప్పు మైదా పిండి
- అర చెక్క నిమ్మరసం
- 2 టేబుల్ స్పూన్ల మొక్క పిండి (ఆప్షనల్)
సాస్ కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- 5 వెల్లుల్లి రెబ్బలు
- ఒక పచ్చిమిరపకాయ ముక్కలు
- ఒక ఉల్లిపాయ ముక్కలు
- ఒక క్యాప్సికం ముక్కలు
- ఒక క్యారెట్ తరుగు
- ఒక టమాటా ముక్కలు
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీ స్పూన్ కారం
- అర టీ స్పూన్ గరం మసాలా
- అర టీ స్పూన్ ఛాట్ మసాలా
- 4 టీ స్పూన్ల టమాటా కెచప్
తయారీ విధానం
- ముందుగా అన్నాన్ని తీసుకుని మిక్సీలో వేసుకుని నీరు పోయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (మిగిలిపోయిన అన్నం లేదా అప్పుడే తాజాగా వండిన అన్నం ఏదైనా ఫర్వాలేదు)
- ఇప్పుడు మిక్స్ చేసుకున్న అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని.. అందులో క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మైదా పిండి, నిమ్మరసం వేసి బాగా కలపి పక్కక పెట్టుకోవాలి.
- ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె పెట్టుకుని ఆ మిశ్రమాన్ని గుండ్రంగా బంతుల్లాగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కడాయిలో ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న బాల్స్‌ను సుమారు 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. (మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోవాలి)
- ఇవి బంగారు వర్ణంలోకి వచ్చాక బయటకు తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడ మరో గిన్నెను తీసుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఇప్పుడు ఇందులోకి క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఇవన్నీ వేగాక టమాటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ఛాట్ మసాలా వేసుకుని బాగా కలపాలి. (లో ఫ్లేమ్‌లో పెట్టి కాసేపు వేయించుకోవాలి)
- ఇప్పుడు ఇందులోకి టమాటా కెచప్‌ను వేసి బాగా కలపి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
- అనంతరం ముందుగానే ఫ్రై చేసుకున్న బాల్స్‌ను యాడ్ చేసుకుని 3 నిమిషాల పాటు సాస్ అంతా బంతులతో కలిసేలా వేయించుకోవాలి.
- అంతే.. అద్భుతమైన మంచూరియాను సర్వ్ చేసుకోవడమే.