Gongura Rice Recipe: గోంగూరతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ఇందులో.. గోంగూర పచ్చడి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అద్భుత రుచిని ఆస్వాదిస్తుంటారు. ఇంతేనా.. మటన్, చికెన్, పనీర్ ఇలా చాలా రకాల వంటకాల్లోనూ గోంగూరను కలిపి వండుతుంటారు. ఇవి అందరికీ తెలుసు. కానీ.. మీరు ఎప్పుడైనా "గోంగూర రైస్" ట్రై చేశారా? లంచ్ బాక్స్‌లోకి ఇది సూపర్ ఛాయిస్. పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో హడావుడి పడే తల్లులకు ఇది మంచి ఆప్షన్. లెమన్ రైస్, ఎగ్ రైస్ మాదిరిగా.. ఈ గోంగూర రైస్‌ను కూడా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కట్టల గోంగూర ఆకులు
- రెండు కప్పుల అన్నం
- రెండు చెంచాల శనగపప్పు
- రెండు చెంచాల మినపప్పు
- మూడు చెంచాల వేరుశనగ (పల్లీలు)
- ఒక చెంచా ఆవాలు
- ఒక చెంచా జీలకర్ర
- కొద్దిగా కరివేపాకు
- అర చెంచా పసుపు
- ఏడు ఎండుమిరపకాయలు
- అర చెంచా ధనియాల పొడి
- అర చెంచా నువ్వుల పొడి
తయారీ విధానం
- ముందుగా గోంగూర రైస్ రెసిపీ కోసం అన్నం వండి పొడిపొడిగా ఆరబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి.
- మరోవైపు గోంగూర ఆకులను తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టి చెంచా నూనె వేసి గోంగూర ఆకులను వేసి వేయించుకోవాలి.
- అవి దగ్గరగా మగ్గిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి.. వాటిని చల్లార్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- మరోసారి స్టౌ ఆన్ చేసి కొద్దిగా నూనె పోసి వేరుశెనగ వేయించి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే ఎండు మిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అనంతరం కరివేపాకు, పసుపు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఇందులోనే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్టు, ధనియాలపొడి, నువ్వుల పొడి, ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి పులిహోరలాగా బాగా కలపాలి.
- రెండు నిమిషాలు వేయించిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే.. టేస్టీ గోంగూర రైస్ రెడీ! వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.