Garlic Chicken Fry Recipe: పార్టీలకు లేదా వీకెండ్స్ లంచ్‌కి చికెన్‌తో ఏదైనా టేస్టీ రెసిపీ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే.. ఈ వెల్లులి కోడి వేపుడును ఓ సారి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే! ఈ పద్ధతిలో చేస్తే చికెన్ ముక్క బయట కరకరలాడుతూనే లోపల మృదువుగా చాలా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం.. వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు
- 400 గ్రాముల బోన్‌లెస్ చికెన్
- 8 పచ్చిమిరపకాయలు
- 30 వెల్లుల్లి పాయలు
- 2 రెబ్బల కరివేపాకు
- ఒక ఉల్లిపాయ ముక్కలు (చిన్నది)
- పావు టీ స్పూన్ పసుపు
- ఒక టీ స్పూన్ గరం మసాలా
- ఒక టీ స్పూన్ వేపిన ధనియాల పొడి
- ఒక టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి
- రుచికి సరిపడా ఉప్పు
- 3 - 4 చుక్కల రెడ్ ఫుడ్ కలర్
- అర టేబుల్ స్పూన్ వెనిగర్
- 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్
- ఫ్రైకి సరిపడా నూనె
టాసింగ్ కోసం:
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
- 2 పచ్చిమిరపకాయలు
- ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి
- 2 రెబ్బల కరివేపాకు
- అర టీ స్పూన్ వెల్లులి పొడి/ చాట్ మసాలా
- తయారీ విధానం..
- ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత ఇందులోనే వేయించిన దనియాల, జీలకర్ర, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, దంచుకున్న వెల్లులి ముద్ద, కాస్త వెనిగర్ వేసి బాగా రుద్ది ముక్కలకి మసాలాలు పట్టించాలి.
- ఆ తర్వాత చికెన్ కలర్ఫుల్గా కనిపించేందుకు ఫుడ్ కలర్ వేసుకోవాలి.
- అనంతరం ముక్కలు క్రిస్పీగా అవ్వడానికి కార్న్ ఫ్లోర్ వేసి కలిపి సుమారు గంటపాటు పక్కకుపెట్టుకోవాలి.
- ఇప్పుడు వెల్లులి మసాలా ముద్ద కోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో అయితే కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
- గంట తర్వాత స్టౌ ఆన్ చేసి నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు మరిగే నూనెలో కొద్దిగా కొద్దిగా చికెన్ ముక్కలను వేసుకుని మీడియం మంట మీద ఎర్రగా వేయించుకోవాలి.
- రంగు మారిన తర్వాత మంటను హై-ఫ్లేమ్పైకి మార్చి క్రిస్పీగా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో కడాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి అందులోనే జీడిపప్పు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి.
- జీడి పప్పు రంగు మారిన తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కలు, గార్లిక్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. (వెల్లులి పొడి లేనివారు చాట్ మసాలాను చల్లుకోవచ్చు.)
- అంతే అద్దిరిపోయే వెల్లుల్లి చికెన్ వేపుడు రెడీ!
పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!!
చూస్తేనే నోరూరిపోయే "మీల్ మేకర్ మంచూరియా" - 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!