How to Prepare Coconut Halwa: మన నిత్య జీవితంలో పచ్చి కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తాము. పచ్చళ్లు, రైస్, స్వీట్స్ అంటూ వాటితో రకరకాలు చేసుకుంటుంటాం. ఇక స్వీట్స్ విషయానికి వస్తే పచ్చి కొబ్బరితో లడ్డూలు, లౌజులు చేసుకుంటాము. అయితే ఇవే కాకుండా పచ్చి కొబ్బరితో చేసుకునే వాటిలో హల్వా కూడా ఒకటి. బెల్లం, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా దేవుళ్లకు నైవేద్యంగా ఈ హల్వాను తయారు చేసి పెట్టవచ్చు. ఇది చేయడానికి ఎక్కవ సమయం కూడా పట్టదు. అయితే ఈ హల్వాను రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఆ పద్ధతులు? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మొదటి పద్ధతి:
కావాల్సిన పదార్థాలు:
- పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు
- బెల్లం - కప్పు
- యాలకుల పొడి - 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు - 10
- నెయ్యి - తగినంత
తయారీ విధానం:
- మిక్సీజార్ తీసుకుని అందులోకి పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందం ఉన్న పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి.. జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుని లో ఫ్లేమ్‌లో కొబ్బరి మిశ్రమం ముద్దగా అయ్యి పాన్‌కు అంటుకోకుండా సెపరేట్ అయినప్పుడు దింపేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అవ్వడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఈ ఇరవై నిమిషాలు కూడా మంట సిమ్‌లోనే ఉంచి కలుపుతూనే ఉండాలి.
- మిశ్రమం దగ్గరపడిన తర్వాత యాలకులు పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి కలుపుకోవాలి. దింపేముందు ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ..
అందం నుంచి ఆరోగ్యం వరకు - కొబ్బరి పాలతో కోటి ప్రయోజనాలు - జస్ట్ ఇలా తీసుకుంటే చాలు!
రెండో పద్ధతి:
కావాల్సిన పదార్థాలు:
- పెసరపప్పు - అర కప్పు
- పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు
- బెల్లం - కప్పున్నర
- బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి - టేబుల్ స్పూన్
- ఉప్పు - చిటికెడు
- నీరు - సరిపడా
- నెయ్యి - సరిపడా
- జీడిపప్పు పలుకులు - 10
- ఎండు ద్రాక్ష - 10
తయారీ విధానం:
- ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీజార్ తీసుకుని అందులోకి పెసరపప్పు పొడి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, బియ్యం పిండి, యాలకుల పొడి, ఉప్పు, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకుని సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంతవరకు వేయించుకోవాలి. సుమారు ఈ మిశ్రమం దగ్గర పడటానికి 20 నిమిషాలు పడుతుంది.
- ఆ తర్వాత మరికొంచెం నెయ్యి, వేయించిన డ్రైఫ్రూట్స్ వేసుకుని దింపేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే హల్వా రెడీ!
పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ!
శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!