How to Make Chaat Masala at Home: చాట్ మసాలా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. పకోడీ, పానీపూరీ, బఠానీ చాట్, సలాడ్, రైతా, బటర్ మిల్క్, మసాలా చాయ్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల వంటకాల్లో దీనిని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ మసాలా వేసి ప్రిపేర్ చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో మార్కెట్ నుంచి కొని తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో కొనుగోలు చేసే చాట్ మసాలా పొడిలో రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలుగా ఉపయోగించే ఈ పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పోలా. మాకు రాదు అంటారా? డోంట్ వర్రీ, ఈ సింపిల్ టిప్స్‌తో చాట్ మసాలా ప్రిపేర్ చేసుకోండి. మార్కెట్లో తెచ్చిన మసాలా కంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క - 1 ఇంచ్
- లవంగాలు - 4
- మిరియాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- పుదీనా ఆకులు - పావు కప్పు
- శొంఠి - చిన్న ముక్క
- రాళ్ల ఉప్పు - 1 టీ స్పూన్
- ఇంగువు - పావు టీ స్పూన్
- బ్లాక్ సాల్ట్ - 3 టీ స్పూన్లు
- ఆమ్చూర్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు
- పంచదార - 1 టీ స్పూన్
- వంటసోడా - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- కాడలు లేకుండా కేవలం పుదీనా ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఆకులను శుభ్రంగా కడిగి జల్లెడలో వేసి పక్కన ఉంచాలి.
- స్టవ్ పైన పాన్ పెట్టి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత జీలకర్ర వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా, క్రిస్పీగా అయ్యేవరకు కలుపుతూ వేయించాలి.
- పుదీనా ఆకులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- మిక్సీజార్‌లోకి వేయించుకున్న ధనియాల మిశ్రమం, పుదీనా ఆకులు వేయాలి.
- ఆ తర్వాత శొంఠి ముక్కలు, రాళ్ల ఉప్పు, ఇంగువ, బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, పంచదార, వంట సోడా, కారం వేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని గాజు జార్లో స్టోర్ చేస్తే సరి. అంతే ఎంతో టేస్టీగా ఉండే చాట్ మసాలా రెడీ.
- నచ్చితే మీరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కావాల్సిన వంటకాల్లో వాడుకోండి.
అద్దిరిపోయే రుచితో "పనీర్ షావర్మా" - ఇలా ప్రిపేర్ చేస్తే బయట కొనాల్సిన అవసరం ఉండదు!
"రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్" - ఇంట్లో దోశ పెనం మీదనే - మీరే మాస్టర్ చెఫ్!