How To Make Pachi Pulusu : వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోవడంతో కొన్నిసార్లు ఏ కర్రీలతోనూ అన్నం తినాలనిపించదు. అటువంటి సమయంలో చాలా మంది సాంబార్, పప్పు చారు, టమట రసం వంటి వాటితో తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ రెసిపీలు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. కొన్నిసార్లు వంట చేయడం ఆలస్యమైనప్పుడు ఇవి చేయడం కుదరదు. అయితే, ఇలాంటి సమయం కేవలం పది నిమిషాల్లో రెడీ అయ్యే పచ్చి పులుసు చేసుకుంటే.. టేస్ట్ అదుర్స్. కరకరలాడే పచ్చి ఉల్లిపాయ ముక్కలతో.. నోటికి పుల్ల పుల్లని రుచి తగులుతూ ఉండే ఈ పచ్చిపులుసును.. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటది.. నా సామిరంగా అనాల్సిందే! మరి ఈ పచ్చి పులుసును రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు :
- చింతపండు - 100 గ్రాములు
- పచ్చి మిర్చి - 6
- కొత్తిమీర కొద్దిగా
- పసుపు -అర టీస్పూన్
- జీలకర్ర- టీ స్పూన్
- కరివేపాకు - 4
- ఉల్లిపాయలు- 2
- టమాటా-1
- ఎండు మిర్చి - 4
- రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
సింపుల్గా పచ్చిపులుసు ఎలా చేయాలంటే :
- ముందుగా స్ట్రెయినర్ సహాయంతో సన్నని మంటపై పచ్చిమిర్చిలను దోరగా కాల్చుకోండి. ఇవి వేసి చేస్తే పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది.
- తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి.. టీస్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి.
- కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఎండుమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా దంచుకోండి.
- ఇప్పుడు చిన్న బౌల్లో కాల్చుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చేతితోనే మెత్తగా చిదుముకోవాలి.
- అలాగే మరొక పెద్ద గిన్నెలో చింత పండును వేసి అరలీటర్ నీళ్లు పోసి ఓ పది నిమిషాల సేపు నానబెట్టి.. రసాన్ని తీసుకోవాలి.
- ఇప్పుడు ఆ చింత పండు రసంలో ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోండి.
- మీకు ఇష్టమైతే చిన్న టమాట ముక్కలను కూడా ఈ పచ్చిపులుసులో వేసుకోవచ్చు.
- తర్వాత ఇందులో పసుపు, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, ఎండు మిర్చి మిశ్రమం వేసి.. చేతితోనే బాగా మిక్స్ చేయండి.
- పచ్చిపులుసులోని పదార్థాలన్నింటినీ చేతితో మెదుపుతూ కలపడం వల్ల.. పచ్చి పులుసు ఎంతో రుచిగా ఉంటుంది.
- ఒక్కసారి ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలోకి కొద్దిగా పచ్చిపులుసు పోసుకుని తిన్నారంటే.. టేస్ట్ అద్దిరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్లా తాగేయొచ్చు!