How to Make Corn Curry : సాధారణంగా మొక్కజొన్న పొత్తులను.. నిప్పుల మీద కాల్చుకునీ, నీళ్లలో ఉడకబెట్టుకుని తింటుంటాం. అలాగే.. గారెలు, వివిధ రకాల స్నాక్స్ చేసుకుంటుంటాం. ఈ కంకులతో ఏ రెసిపీలు చేసినా టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఇప్పుడు మొక్కజొన్న కంకులతో కాస్త వెరైటీగా మసాలా కర్రీ చేసేద్దాం. ఈ కర్రీ చపాతీ, పూరీ, అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఘుమఘుమలాడేలా వండొచ్చు. మరి, ఆలస్యం చేయకుండా "మొక్కజొన్న మసాలా కర్రీ"కి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు :
- మొక్కజొన్న-2 (లేతగా ఉన్నవి)
- ఉల్లిపాయలు- 2
- టమాటాలు-4
- పచ్చిమిర్చి-5
- కారం -టీస్పూన్
- ఉప్పు -రుచికి సరిపడా
- కొత్తిమీర-కొద్దిగా
- పసుపు-పావుటీస్పూన్
- గరం మసాలా-పావుటీస్పూన్
- అల్లం పేస్ట్-టీస్పూన్
- కరివేపాకు-2
- ఆవాలు-అరటీస్పూన్
- జీలకర్ర-అరటీస్పూన్
- శనగపప్పు -అరటీస్పూన్
- మినప్పప్పు- అరటీస్పూన్
- జీలకర్ర పొడి- అరటీస్పూన్
- నీరు -అర గ్లాసు
తయారీ విధానం :
- ముందుగా మొక్కజొన్న కంకుల గింజలను వలుచుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు.. స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించండి. తాలింపు వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయండి.
- ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మొక్కజొన్న గింజలు వేసి కలపండి.
- గిన్నెపై మూతపెట్టి మొక్కజొన్న గింజలను 5 నిమిషాలు మగ్గించుకోండి.
- తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసి కలపండి. అలాగే టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
- టమాటాలు ఉడికిన తర్వాత కారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపండి.
- మసాలా మిశ్రమం మొక్కజొన్న గింజలకి పట్టిన తర్వాత నీళ్లు పోయండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోండి.
- చివర్లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న మసాలా కర్రీ రెడీ.
- నచ్చితే ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి.
- ఈ కర్రీ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తినేలా ఉంటుంది. చూడడానికి మాత్రమే కాకుండా.. టేస్ట్ చేయడానికి కూడా చాలా కొత్తగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
అద్దిరిపోయే రుచితో "కార్న్ క్యాప్సికం మసాలా" - ఇలా చేశారంటే మైమరచిపోవాల్సిందే!
సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ : తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా" - దీని టేస్ట్ ముందు బిర్యానీ కూడా బలాదూర్!