Chintakaya Pappu Charu in Telugu: ఈ సీజన్లో వచ్చే పచ్చి చింతకాయను అనేక రకాలుగా వాడుకుంటారు. కొందరు పచ్చడి చేసుకోగా.. మరికొందరు పచ్చి పులుసు చేసుకుంటారు. కానీ.. చింతకాయలతో పప్పు చారు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చెప్పడానికి మాటలుండవ్! అయితే.. పర్ఫెక్ట్గా చేయడం అందరికీ రాదు. మరి, నోరూరించే వేడివేడి చింతకాయల పప్పుచారు ఎలా చేయాలో.. దీనికి కావాల్సిన పదార్థాలేంటో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- 200 గ్రాముల కందిపప్పు
- అర చెంచా పసుపు
- 5 పచ్చిమిరపకాయ ముక్కలు
- కొద్దిగా కరివేపాకు
- 150 గ్రాముల చింతకాయలు
- ఒక చెంచా కారం
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె
- అర చెంచా జీలకర్ర
- అర చెంచా ఆవాలు
- 5 వెల్లుల్లి పాయలు (కచ్చా పచ్చాగా దంచినవి)
- 3 ఎండు మిరపకాయలు
- 2 పచ్చి మిరపకాయలు
- ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ
- పావు చెంచా ఇంగువ
- ఒక టమాటా
- కొత్తిమీర
తయారీ విధానం..
- ముందుగా కుక్కర్లోకి కందిపప్పు తీసుకుని రెండు సార్లు నీటితో బాగా కడగాలి
- ఆ తర్వాత ఇందులోకి కందిపప్పు తీసుకున్న మోతాదులోనే నీటిని పోయాలి. (అరగంట నానబెట్టి ఉడికిస్తే బెటర్)
- అనంతరం ఇందులోకి పసుపు, కరివేపాకు, పచ్చి మిరపకాయ ముక్కలు, ఆయిల్ పోసి బాగా కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేవరకు పప్పును మెత్తగా ఉడికించాలి.
- మరోవైపు చింతకాయలను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి చింతకాయలు మునిగేలా నీటిని తీసుకుని బాగా ఉడికించాలి. (చింతకాయ పొట్టు ఉడిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది)
- స్టౌ ఆఫ్ చేసి చింతకాయలు పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఉడకబెట్టిన చింతకాయ గిన్నెలోని నీటిని పక్కకు మరో గిన్నెలో పెట్టుకోవాలి.
- మళ్లీ చింతకాయలో మరిన్ని మంచి నీటిని పోసుకుని బాగా పిండుతూ రసాన్ని తీయాలి.
- అనంతరం కందిపప్పును పప్పుగుత్తితో లైట్‌గా మెదపాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగానే పిండుకున్న చింతకాయ రసాన్ని పోయాలి.
- ఆ తర్వాత మనకు అవసరమైన పప్పుచారు పరిమాణాన్ని బట్టి నీటిని తీసుకోవాలి.
- అనంతరం కారం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. (పులుపును బట్టి నీటిని కలుపుకోవచ్చు)
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి పప్పు చారు పట్టేంత గిన్నె తీసుకుని నూనె పోయాలి.
- నూనె వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేగనివ్వాలి.
- ఇందులోనే వెల్లుల్లి పాయలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరప ముక్కులు, ఉల్లిపాయ ముక్కులు, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి.
- ఇవ్వన్నీ ఫ్రై చేశాక టమాటాను వేసుకుని సుమారు 2 నిమిషాల పాటు హై ప్లేమ్‌లో ఉడకనివ్వాలి (టమాటా ఆప్షనల్)
- ఆ తర్వాత ఇందులోకి ఉడకబెట్టిన పప్పు చారును వేసుకొని 5-6 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మరగబెట్టాలి. (మధ్యమధ్యలో కలపాలి)
- చివరగా కొత్తిమీర ఆకులు వేసి స్టౌ ఆఫ్ చేస్తే టేస్టీ టేస్టీ చింతకాయ పప్పు చారు రెడీ అయిపోతుంది!