How to make Chakkara pongali : మనలో చాలా మందికి చక్కెర పొంగలి అంటే ఎంతో ఇష్టం. పూజలు, పండగలు, ఉత్సవాల సందర్భంగా ఇంట్లో చేస్తే.. ఒకటికి రెండు కప్పులు ఇష్టంగా తింటుంటాం. ఎన్నో ఏళ్ల నుంచి దేవుడికి సమర్పించే నైవేద్యాలలో ఇది కూడా ఒకటి. అయితే, కొందరికి చక్కెర పొంగలి సరిగా చేయడం రాదు. బెల్లం, చక్కెర అన్నీ వేసినా కూడా టేస్ట్ కొంత తక్కువైపోతుంది. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని చేయడం కూడా ఈజీ. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రాచీన పద్ధతిలో కమ్మటి చక్కెర పొంగలి ఎలా చేయాలి ? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓ లుక్కేయండి..
చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు :
- బియ్యం- కప్పు
- పెసరపప్పు-అరకప్పు
- బెల్లం తురుము-కప్పు
- పంచదార-అరకప్పు
- నెయ్యి-సరిపడా
- ఎండు కొబ్బరి ముక్కలు-పావుకప్పు
- టేబుల్‌స్పూన్ చొప్పున - జీడిపప్పు, కిస్‌మిస్
- చిటికెడు - యాలకులపొడి
- చిటికెడు పచ్చకర్పూరం
- తేనె-3 టేబుల్‌స్పూన్లు
- నీరు
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై కడాయి పెట్టి పెసరపప్పు వేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. పెసరపప్పుని దోరగా రంగు మారెంత వరకు వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం, వేయించిన పెసరపప్పు వేసుకుని రెండుమూడు సార్లు నీటితో కడగండి.
- తర్వాత ఒక పెద్ద గిన్నెలో 4 గ్లాసుల నీరు, కొద్దిగా నెయ్యి పోసి స్టౌపై పెట్టండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అన్నం 90 శాతం ఉడికించుకుని స్టౌ ఆఫ్ చేయండి.
- ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టౌపై మరొక గిన్నె పెట్టుకొని గ్లాసున్నర నీటిని పోసుకోండి. నీటిలో బెల్లం తురుము, చక్కెర వేసి పూర్తిగా కరిగించండి.
- ఆపై ఒక గిన్నెలోకి బెల్లం పాకం వడకట్టుకోండి.
- తర్వాత వడకట్టిన బెల్లం పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టౌపై పెట్టండి. పాకం కాస్త జిగురుగా మారిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ.. మూతపెట్టి పొంగలి ఉడికించుకోండి.
- పొంగలి చిక్కగా మారిన తర్వాత ఇందులో నెయ్యి కలపండి.
- 5 నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఒక పది నిమిషాల తర్వాత పొంగలిలో తేనె వేసి కలపండి.
- (చక్కెర పొంగలిలో తేనె వేస్తే రుచి చాలా బాగుంటుంది- ప్రాచీన పద్ధతిలో పొంగలి చేయడానికి తేనె ఒక సీక్రెట్ పదార్థం)
- ఇప్పుడు స్టౌపై ఒక చిన్నె గిన్నె పెట్టండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
- తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కాసేపు ఫ్రై చేయండి. దీనిని చక్కెర పొంగలిలో వేయండి. ఆపై చిటికెడు పచ్చకర్పూరం, యాలకులపొడి వేసి మిక్స్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి మీ ముందుంటుంది.
- నచ్చితే ఈ విధంగా చక్కెర పొంగలి ఓ సారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
పాతకాలం నాటి "స్వీట్ సజ్జు" - చిటికెలో చేసుకోండిలా! - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!
సేమియాతో ఉప్మా, పాయసమే కాదు - ఇలా "లడ్డూలు" ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్!