How to Make Beetroot Soup : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ చలి తీవ్రత పెరిగిపోతోంది. పగలంతా ఎండ ఉన్నా.. సాయంత్రమైతే చాలు మెల్లగా చలి మొదలవుతోంది. ఈ చలికాలంలో చాలా మంది వేడిగా ఉన్న ఆహారం తినడానికి ఇష్టపడతారు. అలాగే సూప్‌లు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. మనకు సూప్‌లు అనగానే క్యారెట్, కొత్తిమీర, టమాటాలతో చేసిన వివిధ రకాల సూప్‌లు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్తో కూడా రుచికరమైన సూప్ తయారు చేయవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా బీట్రూట్ సూప్ చేస్తే వేడివేడిగా ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ సూప్ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఇంట్లోనే హాట్‌హాట్ బీట్రూట్ సూప్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- బీట్రూట్-1
- బటర్ -టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకు-1
- మిరియాలు- అరటీస్పూన్
- చిన్న అల్లం ముక్క
- వెల్లుల్లి రెబ్బలు-3
- ఉల్లిపాయ -1
- క్యారెట్-1
- మిరియాల పొడి-చిటికెడు
- ఉప్పు-రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా ఉల్లిపాయ, క్యారెట్లను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి.
- తర్వాత బీట్రూట్పై చెక్కు తీసేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై నాన్‌స్టిక్ పాన్ పెట్టి బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం ముక్క, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి వేయించండి.
- వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించండి.
- తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి.
- తర్వాత కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మరికొద్ది మగ్గించుకోండి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారనివ్వండి.
- తర్వాత బిర్యానీ ఆకు తీసేసి.. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి.
- దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత ఒక జాలీలోకి తీసుకోని సూప్ వడకట్టుకోండి. కొద్దిగా నీళ్లు పోస్తే సూప్ చిక్కగా వస్తుంది.
- ఈ సూప్‌ని స్టౌపై పెట్టి ఒక మూడు నిమిషాలు మరిగించుకోండి.
- ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలపండి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోండి.
- ఈ బీట్రూట్ సూప్‌ని బౌల్లోకి తీసుకుని పైన ఫ్రెష్ క్రీమ్ లేదా చిక్కని కోకనట్ మిల్క్‌తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- ఇలా చేస్తే వేడివేడిగా బీట్రూట్ సూపర్‌గా ఉంటుంది.
- నచ్చితే ఈ వింటర్లో ఈ సూప్ ఓసారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి:
వింటర్ స్పెషల్ : ఘుమఘుమలాడే "టమాటా కొత్తమీర సూప్" - వేడివేడిగా గొంతులోకి జారుతుంటే అదుర్స్!
వింటర్ స్పెషల్ - రెస్టారెంట్ స్టైల్ "టమాటా సూప్"- ఇలా చేస్తే టేస్ట్ అద్భుతం!