Wooden Utensils Cleaning Tips: ఈ మధ్య కాలంలో చెక్క పాత్రల వినియోగం పెరిగిపోయింది. ట్రెండ్, ఆరోగ్యం ఇలా కారణమేదైనా వంట కోసం చెక్కతో తయారుచేసిన పాత్రలు, గరిటెలు వాడడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అయితే వీటిని వాడడం సులువే అయినా.. చక్కగా శుభ్రం చేయకపోతే మాత్రం జిడ్డు వదలకపోవడమే కాకుండా, బ్యాక్టీరియా కూడా చేరే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆరోగ్యానికీ నష్టమే కాకుండా.. మరోవైపు పాత్రల నాణ్యతా తగ్గిపోతుందని చెబుతున్నారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. చెక్కతో తయారుచేసిన పాత్రలు, గరిటెల్ని శుభ్రం చేసే సమయంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మనం పాత్రలపై పేరుకుపోయిన జిడ్డైనా, మురికైనా త్వరగా పోగొట్టేందుకు.. ముందుగా వాటిని కాసేపు వేడి నీళ్లలో నానబెడుతుంటాం. అయితే, ఈ చిట్కాను చెక్క పాత్రల్ని శుభ్రం చేయడానికీ పాటించవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వేడి నీళ్లలో డిష్‌వాషింగ్ లిక్విడ్/సోప్ మిశ్రమంలో వీటిని కాసేపు నానబెట్టాలట. ఆ తర్వాత కడిగేస్తే జిడ్డుదనంతో పాటు దుర్వాసనలు కూడా తొలగిపోతాయని వివరిస్తున్నారు.
- చెక్క పాత్రలపై అందులో ఉన్న పదార్థాల మరకలు పడితే అంత సులభంగా పోవు. ఇలాంటి సమయంలో వెనిగర్, నీళ్లు.. ఈ రెండూ సమపాళ్లలో తీసుకొని ఆయా పాత్రల్ని రాత్రంతా నానబెట్టాలని నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఉదయాన్నే శుభ్రం చేసి పొడిగా తుడిచేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు.
- బేకింగ్ సోడా కూడా చెక్క పాత్రల్ని శుభ్రం చేయడంలో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాటిపై కాస్త బేకింగ్ సోడా చల్లి దానిపై కొద్దిగా నిమ్మరసం పిండాలట. ఆపై మృదువుగా ఉండే స్క్రబ్బర్‌తో రుద్దితే మరకలు పోయి సులభంగా శుభ్రమవుతాయని అంటున్నారు.
- కొన్నిసార్లు చెక్క పాత్రలు శుభ్రం చేశాక కూడా జిడ్డుగా కనిపిస్తుంటాయి. అలాగని వాటిని వదిలేస్తే వాతావరణంలోని దుమ్ము, బ్యాక్టీరియా చేరి అనారోగ్యపూరితంగా తయారవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాటిపై కాస్త బరకగా ఉన్న ఉప్పు చల్లి.. సగానికి కట్ చేసిన నిమ్మ చెక్కతో రుద్దాలట. ఇలా చేయడం వల్ల నిమ్మలోని ఆమ్ల గుణాలు చెక్క పాత్రల్లోని జిడ్డుదనాన్ని తొలగించడంతో పాటు సువాసననూ వెదజల్లుతాయని చెబుతున్నారు.
- నిమ్మరసం కలిపిన వేడి నీళ్లలో చెక్క పాత్రల్ని అరగంట పాటు నానబెట్టినా చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేస్తే పదార్థాల అవశేషాల కారణంగా వాటి నుంచి వచ్చే దుర్వాసనలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే అవి ఎక్కువ కాలం మన్నుతాయని అంటున్నారు.
- ఇవే కాకుండా శాండ్ పేపర్‌తో కూడా చెక్క పాత్రల్ని మరింత సమర్థంగా శుభ్రం చేయవచ్చని అంటున్నారు నిపుణులు. దీనిని పాత్రలపై రుద్దడం వల్ల వాటిపై ఇరుక్కున్న పదార్థాల అవశేషాలు సులభంగా తొలగిపోతాయని చెబుతున్నారు.
- చెక్క పాత్రలను చేత్తోనే శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని డిష్‌వాషర్‌లో వేయడం వల్ల అవి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
- అలాగే వీటిని తడిగా ఉన్నప్పుడే ర్యాక్‌లో భద్రపరచడం వల్ల వాటిపై ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పొడిగా తుడిచి.. గాలికి పూర్తిగా ఆరాకే అల్మరాలో సర్దుకోవాలని సూచిస్తున్నారు.
ఇల్లు మొత్తం చిందరవందరగా ఉందా? ఇలా సర్దితే సూపర్‌గా ఉంటుంది!
ఉసిరికాయతో జ్యూసీ స్వీట్ చేసుకోండి- ఏడాది పాటు హాయిగా తినండి!