House Cleaning Tips in Telugu: బతుకమ్మ, దసరా, దీపావళి వరుసగా పండగలు వచ్చేస్తున్నాయ్. ఇంకెముంది చాలా మంది మహిళలు ఇల్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమవుతారు. బట్టల నుంచి వస్తువల వరకు అన్నింటిని క్లీన్ చేస్తుంటారు. అయితే ఈ సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఇల్లు క్లీన్‌గా లేకుండా ఇంకా మురికిగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా సమయం, శ్రమ రెండు వృథాగా మారిపోతాయని అంటున్నారు. మరి ఇలా జరగకుండా ఉండాలంటే ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు ఉపయోగించే రగ్గులు, పరుపులు, బెడ్ షీట్లు, సోఫాసెట్లపై అతి సూక్ష్మమైన దుమ్ము రేణువులు ఉంటాయి. ఈ దుమ్మును తొలగించుకోవడానికి ప్రత్యేకమైన క్లీనింగ్ పరికరాలు ఉంటాయి. అయితే, ఇలాంటి వాటిని వాడకుండా.. కొంతమంది టవల్స్, చిన్న చిన్న గుడ్డ ముక్కలతో వాటిపై కొడుతూ దుమ్ము దులుపుతుంటారు. దీనివల్ల వాటిపై ఉండే అతి సూక్ష్మమైన దుమ్ము రేణువులు ఇతర వస్తువులపై పడి అవి మురికిగా మారతాయట. ఇంకా ఆ దుమ్మును మనం పీల్చుకోవడం వల్ల మనకే నష్టమని చెబుతున్నారు. అందుకే ఇకపై అలా చేయడం మానుకోని.. వాటిని క్లీన్ చేయడానికి అవసరమైన పరికరాలు ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.
ఇంట్లోని కిటికీలు, అరలు, కొన్ని వస్తువులను తరచుగా శుభ్రం చేయము. కేవలం ఏ పండక్కో, ప్రత్యేక సందర్భానికో కానీ క్లీన్ చేస్తుంటాం. ఫలితంగా వాటిపై దుమ్ము ఆలానే పేరుకుపోయి.. ఇల్లంతా అపరిశుభ్రంగా తయారవుతుందని చెబుతున్నారు. కాబట్టి అప్పడప్పుడైనా వాటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు.
చాలా మంది ఇల్లంతా శుభ్రం చేయడానికి ఒకే క్లాత్/స్పాంజ్‌ని వాడుతుంటారు. ఇంట్లోని వస్తువుల్ని, అరల్ని, ఫ్యాన్లను, కిటికీలను.. ఇలా అన్నింటినీ దానితోనే క్లీన్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒక చోట ఉన్న దుమ్ము, బూజు మరో ప్రదేశంలో అంటుకుంటుదట. ఫలితంగా ఇల్లు శుభ్రపడకపోగా.. మరింత మురికిగా మారుతుందని చెబుతున్నారు. కాబట్టి ఇక నుంచైనా ఒకే క్లాత్‌ను కాకుండా వేర్వురుగా వాడడం మంచిదని సూచిస్తున్నారు.
ఇంకా ఇంటిని క్లీన్ చేసే సమయంలో చాలా మంది చేసే మరో పొరపాటు సరైన వెంటిలేషన్ పాటించకపోవడం. దుమ్ము దులిపేటప్పుడు, క్లీనింగ్ ఉత్పత్తుల్ని వాడే క్రమంలో ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఆ గాలి ఇంట్లోనే ఉండిపోయి.. ఆ ఘాటైన వాసనల ద్వారా మన ఆరోగ్యానికి చేటు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా క్లీన్ చేసిన దుమ్ము అంతా బయటికి సరిగ్గా పోక ఇల్లూ పూర్తిగా శుభ్రపడదని వివరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: క్లీన్ చేసిన ప్రతిసారీ క్లాత్స్/స్పాంజ్‌లు ఉతికి పొడిగా ఆరబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని సరిగ్గా క్లీన్ చేయకపోయినా, పూర్తిగా ఆరబెట్టకపోయినా వాటిపై బ్యాక్టీరియా వృద్ధి చెంది.. వాటిని మళ్లీ వాడినప్పుడు ఇంట్లోని వస్తువులపై చేరే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యాక్యూమ్ క్లీనర్లలోని దుమ్మును సైతం ఎప్పటికప్పుడు తొలగించడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
తక్కువగా వాడే వస్తువులను ఎలా క్లీన్ చేసినా.. ఎక్కువగా వినియోగించే వస్తువుల క్లీనింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు నిపుణులు. కిచెన్ ప్లాట్‌ఫామ్, వాష్‌బేసిన్, సింకు.. వంటివి రోజూ తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. కాబట్టి వాటిని క్రిమి సంహారక ద్రావణాలతో రోజూ క్లీన్ చేస్తేనే.. ఎలాంటి దుర్వాసన దరి చేరకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. వీటితో పాటు డిష్‌వాషర్, వాషింగ్ మెషీన్.. వంటి వాటిని తరచూ శుభ్రం చేయాల్సిందేనని పేర్కొన్నారు. క్లీన్ చేయకపోతే పైపులు జామ్ అయ్యి దుర్వాసన వస్తుందని చెబుతున్నారు.