How To Maintain Healthy Weight: ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన బరువు మెయిన్‌టెయిన్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అసలు, బరువు(Weight) పెరగడానికి కారణాలేంటి? అలాకుండా హెల్తీ వెయిట్ మెయిన్‌టెయిన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి బరువును వయసు, లింగం, జీవనశైలి, కుటుంబ అలవాట్లు, నిద్ర, నివసించే, పని చేసే ప్రదేశంతో సహా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిపైనే బరువు పెరగడం, తగ్గడం అనేది ప్రధానంగా ఆధారపడి ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ.. సరైన పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ వయసు పెరిగే కొద్ది కూడా మీ శరీరాన్ని వీలైనంత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు.
ఆరోగ్యకరమైన బరువును ఎలా మెయిన్‌టెయిన్ చేయాలంటే?
- చురుకుగా ఉండటం, పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
- అలాగే వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమను లక్ష్యంగా చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. వీటితో పాటు మీ వయసు, లింగం, ఎత్తు, బరువు, శారీరక శ్రమ స్థాయి ఆధారంగా మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో తెలుసుకోవాలి. దాని ఆధారంగా ఫుడ్ డైట్ మెయిన్‌టెయిన్ చేయాలని సూచిస్తున్నారు.
- ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే తగ్గడానికి, సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ వ్యాయామం చేసేలా చూసుకోవాలి లేదా తక్కువ కేలరీలు తినాలి. అదే.. బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లయితే తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటూ మీరు తినే కేలరీల సంఖ్యను పెంచుకోవాలంటున్నారు.
బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ఏమి తినాలి?
మీరు బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందులో ప్రధానంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు బరువు తగ్గాలనుకుంటే, పెరగాలనుకుంటే మరికొన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి. అవేంటంటే..
ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ!
బరువు తగ్గాలనుకుంటే ఏం చేయాలి?
- డైలీ డైట్లో అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి.
- రెగ్యులర్‌గా వ్యాయామం(National Institute on Aging రిపోర్టు) చేయాలి. అంటే.. నడక, రన్నింగ్, సైక్లింగ్, ఈత, యోగా, డ్యాన్స్ వంటివి ప్రాక్టీస్ చేయాలి.
- రోజు తగినంత వాటర్ తాగుతూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచాలి.
- అధిక చక్కెర ఉండే ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. అలాగే.. జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
- 2019లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులు బరువు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ డాన్ లూడ్స్ పాల్గొన్నారు.
బరువు పెరగాలనుకుంటే ఏం చేయాలి?
- అవకాడోలు, పీనట్ బటర్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి.
- అలాగే.. త్వరగా కడుపు నిండినట్లు అనిపించే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా రోజంతా కొద్దికొద్దిగా తీసుకోవాలి.
- మీ ఫుడ్ మెనూలో గింజలు, చీజ్, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాలు అధికంగా ఉండే స్నాక్స్ ఉండేలా చూసుకోవాలి.
- స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
- మీ ఆకలిని పెంచడానికి చురుకుగా ఉండాలి. అంటే.. తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
NOTE: ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్రస్టింగ్ : చపాతీ బదులు జొన్నలతో చేసిన ఈ ఆహారాన్ని తినండి - కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు!