Guava Chutney Recipe in Telugu : మనందరికీ సాధారణంగా పచ్చళ్లు అనగానే కూరగాయలు, ఆకుకూరలతో ప్రిపేర్ చేసుకునేవే ముందుగా గుర్తొస్తాయి. కానీ, మీకు తెలుసా? ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే జామకాయతో కూడా అద్దిరిపోయే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. జామకాయలతో పచ్చడి ఏంటని అనుకుంటున్నారా? అయితే, ఓసారి తెలుగువారి వెడ్డింగ్ స్పెషల్‌గా చెప్పుకునే ఈ జామపచ్చడిని ట్రై చేయాల్సిందే. దీన్ని మామూలు పచ్చళ్ల మాదిరిగానే ఈజీగా చేసుకోవచ్చు. రుచి మాత్రం మిగతా వాటికంటే చాలా అద్భుతంగా ఉంటుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి జామకాయలు - అరకిలో
- ఆయిల్ - 2 టేబుల్‌స్పూన్లు
- పలీల్లు - 3 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - గుప్పెడు
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- శనగపప్పు - అరటేబుల్‌స్పూన్
- మినప్పప్పు - అరటేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 5
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - అరటీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కాస్త గట్టిగా ఉండే పచ్చి జామకాయలను ఎంచుకొని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్పూన్ సహాయంతో జామ ముక్కల్లో గింజలు ఉన్న భాగాన్ని తొలగించుకోవాలి. అనంతరం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన చింతపండును నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు వేసుకొని ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న జామకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు తాలింపు కోసం మిర్చి వేయించిన కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప పప్పును వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు చక్కగా వేగిందనుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్పెషల్ "జామకాయ పచ్చడి" రెడీ!
- ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతః అని చెప్పుకోవచ్చు. మరి, నచ్చిందా అయితే మీరు ఓసారి ఇలా జామకాయ పచ్చడిని చేసుకోండి.
ఇవీ చదవండి :
పచ్చడి, పప్పు మాత్రమే కాదు - ఇలా "గోంగూర ఉల్లికారం" చేసుకోండి! - టేస్ట్ అద్భుతం!
చూస్తేనే నోరూరిపోయే తెలంగాణ స్టైల్ "చుక్కకూర పచ్చడి" - గోంగూర చట్నీని మించిన టేస్ట్!